ఒక కొడుకు సచ్చిపోతే ... మరో కొడుకు వికలాంగుడైండు

ఒక కొడుకు సచ్చిపోతే ... మరో కొడుకు వికలాంగుడైండు
  • కుటుంబాన్ని పట్టించుకోకుండా తెలంగాణ కోసం కొట్లాడిండు 
  • లాఠీచార్జీలో గాయపడి పని చేయలేని స్థితి 
  • ప్రభుత్వం పట్టించుకోలేదని నిరసనగా భిక్షాటన  

చౌటుప్పల్, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్ల పాటు పోరాడిన ఓ ఉద్యమకారుడు ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. వికలాంగుడైన కొడుకు, ఉద్యమంలో అయిన గాయంతో ఏ పని చేయరాకపోవడంతో బతుకు బండిని నడపడం ఎలాగో తెలియక ఆవేదన చెందుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని తంగడపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి నరసింహ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో ముందున్నాడు. సడక్ బంద్​లో  పాల్గొన్న నరసింహ పోలీసుల లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడ్డాడు. నడుముకు దెబ్బ తగలగా అప్పటినుంచి ఏ పని చేయలేకపోతున్నాడు. ఉద్యమంలో ఉండగానే చిన్న కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. పెద్ద కొడుకు శివమణికి హై ఫీవర్ వచ్చి ఇంట్లో పడి ఉంటే కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నాడని, తనకు ఉద్యమమే ముఖ్యమని వెళ్లాడు. దీంతో శివమణి పూర్తిగా వికలాంగుడయ్యాడు. 

నెలకు రూ.15 వేల ఖర్చు

నరసింహాను తంగడపల్లిలో అంతా జూనియర్ కేసీఆర్ అని పిలుస్తారు. అలాంటి నరసింహ ఈరోజు తన కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు. నరసింహ టైలర్ కాగా నడుముకు అయిన గాయంతో ఎక్కువ సేపు పని చేయలేకపోతున్నాడు. భార్య బయటకు వెళ్లి పని చేద్దామనుకుంటే వికలాంగుడైన కొడుకును చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నరసింహాకు హార్ట్ సర్జరీ కూడా జరిగింది. కొడుక్కి, తనకు కలిపి నెలకు సుమారు రూ.15 వేల వరకు మందులకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

ఫ్లెక్సీ కట్టి భిక్షాటన

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినా తనకు న్యాయం జరగడం లేదని నిరసనగా, ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి రెండు రోజులుగా భిక్షాటన చేస్తున్నాడు.  రోడ్డున పడ్డ తనను, తన కుటుంబాన్ని భిక్షం వేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.