ఒడిలో తమ్ముడి శవంతో రోడ్డు పక్కన ఎనిమిదేండ్ల కుర్రాడు

ఒడిలో తమ్ముడి శవంతో రోడ్డు పక్కన ఎనిమిదేండ్ల కుర్రాడు

భోపాల్: కండ్లనిండా నీళ్లు.. బుగ్గలపైన చారలు.. ఒడిలో ఉన్న తమ్ముడి డెడ్​బాడీపై వాలుతున్న ఈగలను తోలుతూ, నాన్న ఎప్పుడొస్తడా అని రోడ్డు వైపు దీనంగా చూస్తున్నడా కుర్రాడు. మధ్యప్రదేశ్​లోని మోరేనా​ జిల్లా కేంద్రంలో శనివారం నాడు కనిపించిందీ సీన్. నెహ్రూ పార్క్​ ముందు కూర్చున్న ఆ ఎనిమిదేండ్ల కుర్రాడి పేరు గుల్షన్. ఒడిలో ఉన్నది తమ్ముడి డెడ్​బాడీ. అంబాహ్ తాలూకా బద్ఫారా గ్రామానికి చెందిన పూజారామ్​కు నలుగురు పిల్లలు. నాలుగో వాడికి రెండేండ్లు. వాడి ఆరోగ్యం బాలేకపోవడంతో గుల్షన్​ను వెంటబెట్టుకుని అంబులెన్స్​లో జిల్లా కేంద్రం మోరేనాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిండు. అనీమియాతో బాధపడుతున్న బాబు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయిండు.

వాళ్లను తీసుకొచ్చిన అంబులెన్స్​ తిరిగెళ్లిపోయింది. ఆస్పత్రి డాక్టర్లను అడిగితే ఇంకో అంబులెన్స్​ లేదని చెప్పారు. ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ అంబులెన్స్​డ్రైవర్ 30 కిలోమీటర్ల దూరానికి రూ.1500 డిమాండ్​ చేసిండు. అంతడబ్బులేక పోవడంతో పూజారామ్​ కొడుకు శవాన్ని తీసుకుని బయల్దేరిండు. నెహ్రూ పార్క్​ దగ్గర గుల్షన్​ను తమ్ముడి శవంతో పాటు కూచోబెట్టి ఏదైనా వాహనం దొరకకపోతదా అని వెతకడానికి పోయిండు. చిన్న కుర్రాడు, బట్టతో కప్పిన బాబు శవాన్ని చూసి స్థానికులు అక్కడ గుమిగూడారు. సమాచారం అందుకున్న యోగేంద్ర సింగ్​ అనే పోలీసు అధికారి అక్కడికి చేరుకుని, ఆ తండ్రీ కొడుకులను తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి అంబులెన్స్​లో వాళ్లను 
బద్ఫారా గ్రామానికి పంపించారు.