
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ స్ట్రాటజీ హెడ్ సునీల్ కనుగోలుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సహా వివిధ సెక్షన్స్ కింద ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. మాదాపూర్‌లో సునీల్ ఆఫీస్‌లో మంగళవారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులు రెయిడ్స్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇషాన్ శర్మ (33), వైజాగ్‌కు చెందిన తాతినేని శశాంక్ (36), విజయవాడకు చెందిన మంద ప్రతాప్ (33)లను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో సీసీఎస్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురికి 41 ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు సునీల్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తామని తెలిపారు.
ఫొటోలు మార్ఫింగ్ చేసి..
రాజకీయ నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే సునీల్ ఆఫీసులో సోదాలు చేశామని జాయింట్ సీపీ భూపాల్ తెలిపారు. సునీల్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ పేరుతో ఆఫీస్ రిజిస్టర్ చేశారని చెప్పారు. ఈ ఫౌండేషన్ ఎలాంటి పొలిటికల్ పార్టీ పేరుతో లేదన్నారు. 6 నెలల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. సిటీ సైబర్ క్రైం, చాంద్రాయణగుట్ట, రామ్ గోపాల్ పేట్, అంబర్‌పేట్ పీఎస్‌ల్లో అందిన ఫిర్యాదులతో కేసులు రిజిస్టర్ చేశామని వెల్లడించారు. సునీల్ పరారీలో ఉన్నారని, నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు.