బాధ్యులపై చర్యలు తప్పవు

బాధ్యులపై చర్యలు తప్పవు
  •                 బిడ్డ శవాన్ని మోసుకెళ్లి తండ్రి ఘటనపై విచారణ
  •                 మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ డీడీ అనితా గ్రేస్‍

కరీంనగర్‍ జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి ఆటోస్టాండ్‌‌ వరకు కూతురు మృతదేహాన్ని తండ్రి చేతులపై మోసుకెళ్లిన ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్‍ అనితా గ్రేస్‍ అన్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‍ విచారణకు ఆదేశించారు. దీనిపై విచరణ కోసం బుధవరాం అనితా గ్రేస్‌‌ కరీంనగర్‌‌ జిల్లా ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులు హాస్పిటల్‌‌కు వచ్చినప్పటినుంచి బయటకు వెళ్లే వరకు ఏం జరిగిందో వారు, డాక్టర్లు, సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తామని తెలిపారు. దవాఖానాలో మృతదేహాలను తీసుకెళ్లే వాహనాలు ఉన్నాయా.. ఉంటే ఎన్ని ఉన్నాయి.. ఆ రోజు ఎందుకు పనిచేయలేదు అనేది తెలుసుకుంటామన్నారు. అన్ని తెలుసుకొని కమిషనర్‌‌కు రిపోర్ట్‌‌ ఇస్తానన్నారు. అనంతరం కమిషనర్‌‌ ఆదేశాలను బట్టి బాధ్యులపై చర్యలుంటాయని వివరించారు.  ఆమె వెంట డీఎం అండ్‌‌ హెచ్‍వో రామ్‍ మనోహార్‍ రావు, సూపరింటెండెంట్‍ అజయ్‍ కుమార్‍, ఆర్ఎంవో ఉన్నారు. ఈ నెల ఒకటో తారీఖున కరీంనగర్‍ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన సంపత్‍ అనే వ్యక్తి కూతురు చనిపోతే.. అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో చేతుల పై మోసుకుని ఆటో స్టాండ్ వరకు వెళ్లాడు. ఈ హృదయవిదారక ఘటనపై సోమవారం ‘వెలుగు’లో వార్త ప్రచురితమైంది.