నారాయణ కాలేజీ ఘటన పై విచారణ జరుపుతున్నం

నారాయణ కాలేజీ ఘటన పై విచారణ జరుపుతున్నం

బాగ్ అంబర్పేట్ నారాయణ కాలేజీ ఘటన పై ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఒమర్ జలీల్ స్పందించారు. టీసీ కోసం వచ్చిన సాయి నారాయ‌ణ అనే విద్యార్థి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన పై విచారణ చేస్తున్నామన్నారు. రిపోర్ట్ వచ్చాక బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఆపే హక్కు  ఏ కాలేజీ యాజమాన్యానికి లేదన్నారు.ఫీజుల కోసం వేధింపులకు గురిచేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు దైర్యంగా ఉండాలని.. ఫీజుల విషయంలో ఇబ్బందులు ఉంటే నేరుగా తమకు పిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు తీసుకోవాలని.. లేదంటే ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఒమర్ జలీల్ హెచ్చరించారు. 

రామంతాపూర్‌‌కు చెందిన సాయి నారాయణ గతేడాది అంబర్‌‌పేట్‌ నారాయణ కాలేజీలో ఇంటర్‌‌ పూర్తి చేశాడు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఉండటంతో టీసీ ఇవ్వాలని కాలేజీ సిబ్బందిని అడిగాడు. ఈ విషయంపై తరచూ కాలేజీకి వచ్చి అడుగుతున్నాడు. పెండింగ్‌ ఫీజు కడితేనే టీసీ ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పింది.  ఈ క్రమంలో సాయి నారాయణతో పాటు మరికొంత మంది కాలేజీ కి వచ్చారు. వీళ్ల తరఫున మాట్లాడేందుకు స్టూడెంట్‌ లీడర్లు సందీప్‌, వెంకటాచారిని తీసుకొచ్చారు. వీరంతా ప్రిన్సిపల్‌ చాంబర్‌‌కి వెళ్లి, సాయి నారాయణ టీసీ ఇవ్వాలని అడిగారు. పెండింగ్‌లో ఉన్న రూ.16 వేల ఫీజును చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రిన్సిపల్‌ సుధాకర్‌‌రెడ్డి, ఏఓ అశోక్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఈ క్రమంలో టీసీ కోసం వచ్చిన విద్యార్థి, కాలేజీ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం పెట్రోల్‌ దాడికి దారి తీసింది. ఈ ఘటనలో కాలేజీ ప్రిన్సిపల్‌, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌‌ సహా నలుగురికి గాయాలయ్యాయి.