V6 News

వెలుగు ఓపెన్ పేజీ: సీఎస్ఆర్ నిధులతో సమాజాభివృద్ధి

వెలుగు ఓపెన్ పేజీ: సీఎస్ఆర్ నిధులతో సమాజాభివృద్ధి

కార్పొరేట్ సామాజిక బాధ్యత ( సీఎస్ఆర్)  సమాజ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  ఎంతోమంది మహనీయులు  తమ బాధ్యతగా దేశాభివృద్ధికి తోడ్పతున్నారు. సమాజంలో ఆర్థిక అంతరాలను కొంతమంది మేధావులు తమ​అభిప్రాయాలను, నివేదికల రూపంలో తెలియజేశారు.  ప్రపంచంలో అత్యధిక ఆస్తులు గల మొదటి 26 మంది మహాకోటీశ్వరులు,  380 కోట్లమంది పేదలకున్న మొత్తం ఆస్తుల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. మనదేశంలో 1శాతం మంది దగ్గర 54 శాతం సంపద  పోగుపడి ఉంది. 10శాతం మంది దగ్గర 77.7 శాతం సంపద ఉంది.  

తెలంగాణలోని 69 మంది  కుబేరుల అధికారిక సంపద 4 లక్షల కోట్లు.  అనధికారికంగా అంతకు రెట్టింపు ఉండొచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని 3.7 కోట్ల జనాభా ఏడాది సంపదతో సమానం. ‘మహత్​ధన–మహత్​ధమన’ ఒకరి సంపద ఇంకొకరికి విపత్తు  కాకూడదు.  లాభాల కన్నా నిజాయితీ,  మాటలకన్నా చేతలు, వ్యక్తిగత మేలుకన్నా సామాజిక  ప్రయోజనం ఎల్లప్పుడూ మిన్న. వాటినే  మనం ఆదర్శాలుగా మలుచుకోవాలి. 

ఆక్స్​ఫామ్​ ఇండియా రిపోర్టు

జనాభాలో 1శాతానికి సమానమైన కుబేరుల దగ్గర దేశ సంపదలో 40 శాతం సంపద పోగుపడి ఉంది.  దిగువస్థాయిలోని 50 శాతం ప్రజల దగ్గర 3 శాతమే ఉంది. 2021 సంవత్సరంలో 84 శాతం  గృహస్థుల  సంపాదన చాలా కనిష్టస్థాయికి  చేరింది. కానీ శత కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. దాదాపు 25 సంవత్సరాల క్రితం మనదేశంలో  కేవలం 9 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు.  హరున్​ ఇండియా లిస్ట్ ప్రకారం బిలియనీర్ల సంఖ్య 350కి పెరిగింది.  వీరి సంపద విలువ దాదాపు మన జీడీపీలో  సగానికి సమానం.  కార్పొరేట్​ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)  వలన ఎన్నో అభివృద్ధి పనులు  చేపట్టవచ్చును.  ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సౌకర్యాల కల్పన,  కొన్ని ఆసుపత్రులు మినీ డంప్​యార్డులుగా కనిపిస్తున్నాయి. 

ఈ పరిస్థితిని నివారించి సీఎస్ఆర్​ నిధులతో ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి మెరుగైన చర్యలు చేపట్టవచ్చు.    2026–27 ఆర్థిక సంవత్సరంలో మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​కు  కేటాయించిన మొత్తం రూ.13, 679 కోట్లు. కానీ, పేద రోగులకు 10శాతం  మెరుగైన  వైద్యం కూడా అందడం లేదు.  అవసరమైతే  సీఎస్​ఆర్​ పాథలాజికల్​ ల్యాబ్​ను ఆసుపత్రి పరిసర ప్రాంతంలో ఏర్పరచి పేదవారికి ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలి.  అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని క్రమంగా అభివృద్ధి పరిచి ఎంఆర్​ఐ స్కాన్​లు కూడా ఉచితంగా నిర్వహించాలి. ప్రభుత్వ ఆసుపత్రి పేద రోగులపాలిట కల్పతరువు కావాలి.  

సీఎస్ఆర్ నిధులతో విద్యాభివృద్ధి

పురపాలక  సంఘాలు,  కార్పొరేషన్లు,  మహానగర  పాలకమండలి  మొదలైనవి తడిచెత్త, పొడిచెత్త సేకరించడంలో పూర్తిగా విఫలమైనాయి.  వీటిని ఒక వనరుగా ఉపయోగించాలి. తడిచెత్తను బయోగ్యాస్​ ఉత్పత్తికి,  పొడిచెత్తను రీసైక్లింగ్​ కేంద్రాలకు తరలించాలి. దీంతో డంప్​యార్డ్​ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.  మురుగు నీటిని సీఎస్​ఆర్​ నిధులతో శుభ్రపరచాలి.  ఒక  చెరువును పైలట్​ ప్రాజెక్టుగా తీసుకుని దానిలోకి  చేరేనీరును  శుభ్రపరిచి  వాడుకొనుటకు అనువుగా  మార్చాలి.  

మురుగునీటిని శుభ్రపరచటానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.  భూగర్భ జలాలను కూడా రక్షించుకోవాలి.  సీఎస్ఆర్​ నిధులతో  మారుమూల ప్రాంతాల్లోని  పాఠశాలలను ఎంచుకుని అన్ని వసతులు కల్పించి అభివృద్ధి పరచాలి.  మౌలిక సదుపాయాలను కల్పించాలి.  మారుమూల ప్రాంతాల్లో  పనిచేసేందుకు  ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. 

దీంతో ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటం లేదు.  స్థానికంగా ఉండే విద్యావంతులైన నిరుద్యోగుల సేవలను ఉపయోగించుకుని వారికి సీఎస్​ఆర్​ నిధుల  నుంచి  వేతనాలు చెల్లించాలి.  అవసరమైతే పక్కా భవనాలను ప్రభుత్వ అనుమతితో  నిర్మించి ప్రభుత్వ పాఠశాలలను  వందశాతం సీఎస్​ఆర్​ నిధులతో నడిపించాలి. 90 శాతం ఉపాధ్యాయులను స్థానికంగా  నియమించుకోవాలి.  దీనివల్ల  నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది.  పర్యావరణ పరిరక్షణకు సీఎస్​ఆర్​ నిధులు ఉపయోగించాలి. 

- వేణుగోపాల్ నారెడ్ల

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.