V6 News

వెలుగు ఓపెన్ పేజీ: విద్యా ఒత్తిడిలో కరుగుతున్న పసిప్రాణాలు 

వెలుగు ఓపెన్ పేజీ: విద్యా ఒత్తిడిలో కరుగుతున్న పసిప్రాణాలు 

తెలంగాణ రాష్ట్రంలో ఏటా ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన ఒక సామాజిక ఉద్వేగంగా మారుతోంది.  లక్షలాది మంది విద్యార్థుల  భవిష్యత్తును నిర్ణయించే ఈ ఘట్టం   దురదృష్టవశాత్తూ  కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తోంది.  మార్కుల వేటలో పడి  ప్రస్తుత విద్యా వ్యవస్థ, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ వారిని బలవన్మరణాల వైపు పురికొల్పుతోంది.   2026 ఏప్రిల్ 12న విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాల్సింది పోయి, కొందరు విద్యార్థుల కుటుంబాల్లో  తీరని  చీకటిని మిగిల్చాయి. 

పరీక్షల్లో విఫలమయ్యామన్న వేదన,  ఆశించిన మార్కులు రాలేదన్న ఆవేదన, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశం దక్కదేమోనన్న ఆందోళన వెరసి ఈ లేత ప్రాణాలు బలవన్మరణాలకు పాల్పడ్డాయి. ఫలితాలు వెలువడిన కేవలం 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన ఈ దుర్ఘటనలు, ప్రస్తుత విద్యా విధానంలోని డొల్లతను,  సామాజిక ఒత్తిళ్లను విశ్లేషించాల్సిన అత్యవసర స్థితిని  కల్పిస్తున్నాయి.

విద్యార్థుల్లో  మానసిక ఆందోళన

ఉత్తీర్ణత సాధించలేకపోవడం వంటి చిన్నపాటి వైఫల్యాలను కూడా తట్టుకోలేక విద్యార్థులు మృత్యువు ఒడిలోకి  జారుకోవడం తల్లిదండ్రుల గుండెలను కలచివేస్తోంది. ​ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతుంటారు. గత ఐదారేళ్ల గణాంకాలను పరిశీలిస్తే సగటు ఉత్తీర్ణత శాతం 60 నుంచి70 శాతం మధ్యనే ఉందన్నది కాదనలేని  వాస్తవం.  అంటే, మిగిలిన సుమారు 3.5 నుండి 4 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఏదో ఒక స్థాయిలో విఫలమవుతున్నారు. ఈ భారీ సంఖ్యలో ఉన్న 'అపజయం' పొందిన విద్యార్థుల పట్ల సమాజం ప్రదర్శిస్తున్న వివక్షా పూరిత ధోరణి వారిని మానసిక ఆందోళనలోకి  నెట్టివేస్తోంది. 

ర్యాంకుల వేట

​ప్రస్తుత విద్యావిధానం పూర్తిగా 'ర్యాంకుల వేట' అనే సామాజిక వ్యాధితో  సంక్రమితమైంది. విద్యార్థిని ఒక సృజనాత్మక ప్రాణిగా కాకుండా, కేవలం 'మార్కుల ఉత్పత్తి యంత్రం'గా భావించడం ఇక్కడ అసలైన వైఫల్యం. కార్పొరేట్ విద్యా సంస్థలు రోజుకు 14 నుండి 16  గంటల పాటు విద్యార్థులను ఇనుప గదుల వంటి తరగతుల్లో బంధించి, కేవలం పరీక్షల కోసమే వారిని సిద్ధం చేస్తున్నాయి.  క్రీడలు లేవు, వినోదం లేదు, కనీసం కంటినిండా నిద్ర కూడా లేని ఈ యాంత్రిక జీవనశైలి విద్యార్థుల మెదడుపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది.

దీనివల్ల చిన్నపాటి అసహనాన్ని లేదా అపజయాన్ని తట్టుకునే మానసిక స్థైర్యం వారిలో క్రమంగా నశిస్తోంది.  ఫలితంగా,  మార్కులే  సర్వస్వం అనే భ్రమలో బ్రతుకుతున్న విద్యార్థి, ఆ మార్కులు తగ్గగానే తన జీవితమే ముగిసి పోయిందనే తీవ్ర నిర్ణయానికి వస్తున్నాడు. ​ఈ సమస్యలో కుటుంబాల పాత్ర అత్యంత కీలకమైనది. చాలామంది తల్లిదండ్రులు తమ నెరవేరని ఆశలను పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నారు.  తప్పుడు సంకేతాలు విద్యార్థుల్లో తీవ్ర అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి.  విద్యా సంస్థల్లో పూర్తిస్థాయి సైకాలజిస్టులను నియమించాలనే నిబంధనలు కేవలం ప్రభుత్వ జీవోలకే పరిమితమయ్యాయి తప్ప, క్షేత్రస్థాయిలో అమలుకు  నోచుకోవడం లేదు.

​హెల్ప్ లైన్లను, కౌన్సెలింగ్ కేంద్రాలను పటిష్టం చేయాలి 

​ప్రభుత్వం కేవలం ఫలితాల ప్రకటనకే పరిమితం కాకుండా, పరీక్షలకు ముందు, ఫలితాల తర్వాత జిల్లా స్థాయిలో నిరంతర హెల్ప్​లైన్లను, కౌన్సెలింగ్ కేంద్రాలను పటిష్టం చేయాలి. విద్యా సంస్థలపై పర్యవేక్షణ పెంచి, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్కులు కాదు, 'మనుగడ' ముఖ్యమని భరోసా ఇవ్వాలి. ​ 

తెలంగాణలో విద్యా కుసుమాలు వాడిపోకూడదు.  విద్యార్థి ప్రాణం  కంటే  విలువైన ర్యాంకు ఈ ప్రపంచంలో  లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.  విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చి,  విద్యార్థుల్లో  మానసిక ధైర్యాన్ని,  సృజనాత్మకతను నూరిపోసే వాతావరణాన్ని  కల్పించినప్పుడే  నిజమైన బంగారు తెలంగాణను  నిర్మించగలం. 

- రామకిష్టయ్య సంగన భట్ల 
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.