స్థానిక సంస్థల్లో బీసీలదే అధికారం

స్థానిక సంస్థల్లో బీసీలదే అధికారం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మంత్రుల ప్రకటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రసార మాధ్యమాలలో జరుగుతున్న చర్చలు ఈ సందడిని ఉధృతం చేస్తున్నాయి.  తెలంగాణలో డిసెంబర్ 2023న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు నుంచి నేటివరకు కులగణనపై జరిగిన ప్రభుత్వ, పౌరసంఘాల చర్యల ఫలితంగా బీసీలలో బలమైన రాజకీయ చైతన్యం రగులుకుంది.  

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే నినాదం గ్రామ గ్రామాన ప్రజల మనసుల్లో నాటుకుపోయింది.  దీనికి అనుకూలంగా 42శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయని బీసీలు ఆశపడుతున్నారు.  అవి లేకుండా రాజ్యాంగ అధికారాన్ని సాధించలేమేమో అనే భయాందోళనలను కూడా వెలిబుచ్చుతున్నారు.  జనాభా ఆధారిత  భాగస్వామ్య అధికారం కోసం 19వ శతాబ్దంలో ఫూలే ఉద్యమించడం, దానికి అంబేద్కర్ రాజ్యాంగ రూపాన్ని ఇవ్వడం జాతి నిర్మాణానికి పునాదిరాయిగా నిలిచింది. దేశ ఐక్యతను కాపాడింది. 13 డిసెంబర్ 1946 నాడు  నెహ్రూ  రాజ్యాంగసభలో మాట్లాడుతూ  మైనారిటీ,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తగిన రక్షణలు కల్పిస్తామని  ‘ఆబ్జెక్టివ్ రిజల్యూషన్’ ద్వారా భారతదేశం ముందు ప్రమాణం చేశారు. ఆ తీర్మానాన్ని రాజ్యాంగ సభ ఆమోదిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగంలో పొందుపరిచారు. అందువల్లనే  కుల అణచివేత,  వివక్షలు లేని సామాజిక ఆధారిత జాతి నిర్మాణం జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. వెనుకబడిన తరగతుల రాజ్యాంగ రక్షణలు రాజ్యాంగ పీఠిక,  ఫండమెంటల్ రైట్స్, ఆదేశిక సూత్రాలలో పొందుపరచడమైంది.  రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చాల్సిన బాధ్యత రాజ్య వ్యవస్థకు నిర్దేశించడమైంది. ప్రభుత్వాలు, పాలకవర్గాలు, న్యాయవ్యవస్థలు రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడంలో సఫలీకృతం కాలేకపోవడం నేటి వాస్తవం. 

మేం ఎంతో.. మాకు అంత

గత ఏడు దశాబ్దాలుగా బీసీల ఆధారిత రాజ్యాంగ అధికారాన్ని అందించడంలో పార్టీలు, ప్రభుత్వాలు కొంతమేరకు ప్రయత్నం చేసినా సంపూర్ణ సాధన లోపించింది. అందుకే ఈరోజు దేశంలో  ‘మేం ఎంతో మాకు అంత’ అనే నినాదం బలంగా ముందుకు వస్తోంది.   రాజ్యాంగాన్ని వ్యతిరేకించే బీజేపీ కూడా జాతీయ కులగణనను అంగీకరించడం సామాజిక న్యాయ శక్తుల గెలుపుగా భావించాలి.  కులగణనను బిహార్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు జరపడం సామాజిక న్యాయ జాతి నిర్మాణంలో ముందడుగులాగ పరిగణించాలి. కులగణన సామాజిక న్యాయసాధనలో మొదటి మెట్టు. సామాజిక న్యాయంతో కూడిన రాజకీయ అధికారం, జనాభా ఆధారిత రాజకీయ భాగస్వామ్యం కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత.  దాంట్లో భాగంగా బిహార్,  తెలంగాణ రాష్ట్రాలు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుకోసం చేసిన ప్రయత్నాలను గమనించాలి.  కానీ,  బీజేపీ/ఎన్డీయే నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాకేం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

బీసీలకు బీజేపీ వ్యతిరేకం

ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్,  ప్లానింగ్ డిపార్ట్​మెంట్​లతో  కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా చట్టం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ,  ఈరోజు వరకు బీజేపీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చట్టాన్ని  9వ షెడ్యూల్లో  పెట్టుటకు ఎలాంటి సుముఖతను చూపించడం లేదు. బీసీల వ్యతిరేక బీజేపీ ఆధిపత్య నిరంకుశత్వాన్ని ప్రజాక్షేత్రంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎండగట్టాల్సి ఉంది. కాంగ్రెస్, పార్టీలు,  ప్రజా సంఘాలను సమీకరిస్తూ బీజేపీ బాధ్యతా రాహిత్య, ప్రజాస్వామిక వ్యతిరేక స్పృహను పెద్ద ఎత్తున ఎండగట్టాలి.  అవసరమైతే బీజేపీ రాజకీయ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది.  పంచాయతీలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానని అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రామిస్ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నినాదంతో అధికారానికి వచ్చిన ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనలో పలు చర్యలు తీసుకున్నప్పటికి ప్రయత్నంలో సంపూర్ణత లోపించినట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీలకు భిన్నంగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది.

కేంద్రంపై ఒత్తిడి తేవాలి

మంత్రులు, నాయకులు చేస్తున్న ప్రకటనలను చూస్తే 42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధించకుండా పంచాయతీ ఎన్నికలకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఇది ముమ్మాటికి న్యాయబద్ధమైనది కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ల నుండి 22% ఇస్తామని 18% ఇచ్చింది.  కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు చేయకుండానే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పంచాయతీలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఆగింది.  కేంద్ర ప్రభుత్వంపై  తెలంగాణ ప్రభుత్వం అనుకున్న మేరకు ఒత్తిడి తీసుకురాలేదు.  బీజేపీ కేంద్రంలో అడ్డుకుంటుందన్న ప్రచారం కూడా చేయలేదు.  రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలత లోపించడం సరైనది కాదు. 

మేల్కొన్న బీసీల సమాజం

బీసీల పట్ల వివక్ష, అణిచివేతలతో గత ఏడు దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను అవమానిస్తూ వస్తున్నాయి. ఇలాంటి రాజకీయాలు ఇకపై చెల్లవని గమనించాలి. బీసీ సమాజం మేల్కొన్నది. అవమానకరమైన రాజకీయాలు ఎవరు చేసినా బీసీ సమాజం ప్రతిఘటిస్తుంది.బీసీ రిజర్వేషన్లను 42% కు ఖరారు చేసిన తరువాతే పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టాలి.  జాతీయ కాంగ్రెస్ జనాభా ఆధారిత రాజకీయ భాగస్వామ్యం అనే నినాదాన్ని బలంగా ముందుకు తీసుకొస్తోంది. రాజ్యాంగం అందించిన సామాజిక న్యాయం, భాగ స్వామ్యంతో కూడిన అధికారాన్నీ ఇండియా అలయన్స్ కోర్ ఎజెండాగా తీసుకువస్తోంది.  సామాజిక భాగస్వామ్యంతో కూడిన రాజ్యాధికారమే అసలైన  ఎజెండాగా రూపొందాలని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు ఆశిస్తున్నారు.

- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన,
అధ్యక్షుడు, సమాజ్ వాదీ పార్టీ, తెలంగాణ