EPIC Title Glimpse Release: 'బేబీ' జంట రిపీట్.. శేఖర్ కమ్ముల హీరో - సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

EPIC Title Glimpse Release: 'బేబీ' జంట రిపీట్.. శేఖర్ కమ్ముల హీరో - సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

'బేబీ' ( Baby ) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన సృష్టించిన యువ జంట ఆనంద్ దేవర్ కొండ, వైష్ణవి చైతన్య,  వీరిద్దరు మరో సారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తన సహజమైన నటన, మాస్ పర్ఫార్మెన్స్ తో వైష్ణవి యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ హిట్ పెయిర్ మళ్లీ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తూ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో, ఈ జంట నటిస్తున్న తదుపరి చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పేరు 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' (EPIC - First Semester). లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్  ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సినిమా నేపథ్యాన్ని, కథాంశాన్ని అద్భుతంగా పరిచయం చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 కొత్త తరహా ప్రేమకథ

ఈ ప్రేమకథా చిత్రాన్ని 90s నాటి సుప్రసిద్ధ వెబ్‌సిరీస్ '90s ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌' లోని పాత్రల స్ఫూర్తితో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. '90s' సిరీస్‌ను డైరెక్ట్ చేసి అపారమైన ప్రశంసలు అందుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన స్టైలిష్ టేకింగ్, కథ చెప్పే విధానం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచింది.

►ALSO READ | ChiruVenky: చిరంజీవి, వెంకటేష్ మెగా స్టెప్పులు.. 'మన శంకరవరప్రసాద్‌గారు' లో అసలు విందు ఇదే!

గ్లింప్స్‌లో ఆనంద్ దేవరకొండ పలికిన ఒక డైలాగ్ సినిమా కథాంశంపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ డైలాగ్..  "ఇది శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ". ఈ ఒక్క వాక్యం... సున్నితమైన, స్వచ్ఛమైన ప్రేమను, ఇంటెన్స్, వైలెంట్ ఎమోషన్స్‌తో కూడిన ప్రేమను కలగలిపిన సరికొత్త లవ్ స్టోరీని తెరపై చూడబోతున్నామనే భావనను కలిగిస్తోంది.

అగ్ర నిర్మాణ సంస్థల కలయిక

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'బేబీ' తర్వాత ఆనంద్-వైష్ణవి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్, గ్లింప్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఒక నయా అనుభూతిని ఇవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.