ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో టైటిల్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. లండన్‌లో విద్యార్థుల స్నాతకోత్సవం రోజు తనకు కాబోయే వరుడికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి వైష్ణవి చెబుతుండగా గద్దర్ గెటప్‌లో వచ్చి సర్‌ప్రైజ్ చేస్తాడు ఆనంద్.
సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి, శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అనే వాయిస్‌తో టీజర్ ఎండ్ చేశారు. ఇక ప్రెస్‌మీట్‌లో ఆనంద్ మాట్లాడుతూ ‘‘90స్’ వెబ్ సిరీస్‌లో చిన్నప్పటి ఆదిత్య పాత్ర పెద్దయ్యాక తల్లిదండ్రుల ఒత్తిడిపై లండన్ కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది అనే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. లండన్‌లో జరిగే కథ అయినా.. మన ఇంట్లో జరిగే కథలా ఉంటుంది’ అని చెప్పాడు.
‘జీవితంలో మనం దాటి వచ్చిన చిన్న చిన్న అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంటుంది’ అని వైష్ణవి చెప్పింది.‘ఇదొక మధ్యతరగతి యువకుడి ప్రేమ కథ. ప్రతి ఒక్కరూ తమని తాము ఊహించుకునేలా ఉంటుంది’ అని దర్శకుడు చెప్పాడు. దీనికి సీక్వెల్ కూడా ఉండటం వల్లే టైటిల్‌లో ఫస్ట్ సెమిస్టర్ అని పెట్టామని నిర్మాత నాగవంశీ తెలియజేశారు.
