నీరజ్ చోప్రా కోసం ‘జావెలిన్ గోల్డ్’ ఎడిషన్ XUV 700

నీరజ్ చోప్రా కోసం ‘జావెలిన్ గోల్డ్’ ఎడిషన్ XUV 700
  • తొలికారును నీరజ్‌కు బహుకరించిన ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. అక్కడ.. ఇక్కడ అని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నీరజ్ చోప్రా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. భారతదేశంలో అయితే నీరజ్ చోప్రా పేరు ఒక బ్రాండ్ గా మారింది. క్రికెటర్లు తప్ప మరో క్రీడాకారుల గురించి పెద్దగా తెలియని, పట్టించుకోని భారతదేశంలో ఇప్పుడు నీరజ్ చోప్రా యూత్ కు ఐకాన్ గా మారిపోయాడంటే అతిశయోక్తి కాదేమో. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా క్రేజ్ బంగారు పతకం సాధించిన వెంటనే తనదైన శైలిలో స్పందించిన ఆనంద్ మహీంద్రా తన ఫ్లాగ్ షిప్ ఎస్ యూవీ ‘ఎక్స్‌యూవీ700’లో జావెలిన్ ఎడిషన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తొలికారును నీరజ్ చోప్రాకు బహుకరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లే ‘ఎక్స్‌యూవీ 700 జావెలిన్ గోల్డ్ ఎడిషన్’ ను నీరజ్ చోప్రాకు బహుమతిగా అందజేశారు.

ఆనంద్ మహీంద్రా పంపిన బహుమతిపై నీరజ్ చోప్రా ట్విటర్ ద్వారా స్పందించి ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలియజేశారు. తనకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారును బహుమతిగా ఇచ్చినందుకు  కృతజ్ఘతలు తెలిపారు. నీరజ్ చోప్రా ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ.. ‘మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు.. మా ఎక్స్ యూవీ, ఛాంపియన్స్ రథం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో కూబా పతకాలు సాధించిన వారికి కూడా ఇలాంటి వాహనాలనే బహుమతిగా ఇస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ప్రకటించిన విషయం తెలిసిందే.
నీరజ్ చోప్రా కోసం  స్పెషల్ డిజైన్
ఆనంద్ మహీంద్రా నీరజ్ చోప్రా కోసం తయారు చేయించిన వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. లోపలా.. బయట ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కారును పూర్తిగా మిడ్ నైట్ బ్లాక్ రంగు వేసి.. క్రోమ్ కోటింగ్ ఉన్న వాటిని బంగారపు భాగాలతో తళుక్కుమని మెరిసేలా చేశారు. అంతేకాదు ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా బల్లెం విసిరిన 87.58 మీటర్ల రికార్డును స్టిక్కర్ రూపంలో కారు వెనుక టెయిల్ గేట్ పై.. డ్రైవింగ్ సీటు వైపు ముందు భాగంలో అమర్చారు. ఈ స్పెషల్ ఎడిషన్ మార్పులను ఆనంద్ మహీంద్రా సూచనల మేరకు ఆయన సంస్థలోని చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ ప్రతాప్ బోడే దగ్గరుండి చేయించారు. కారు రిజిస్ట్రేషన్ సమయంలో కూడా నీరజ్ చోప్రా కూడా ఈ నాలుగు నంబర్లనే ఎన్నుకున్నారు.