రిషి సునాక్ ఎన్నికపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

రిషి సునాక్ ఎన్నికపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

ముంబయి : భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో తరచూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక విషయంపై తనదైన స్టైల్లో స్పందిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. నేడు భారతీయులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పారు. 

‘‘1947లో స్వాతంత్ర్యం వేళ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు. జీవితం ఎంతో అందమైంది’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ పై చాలా మంది కామెంట్స్ తో కేక పుట్టిస్తున్నారు. భారత్‌కు చెందిన చాలా మంది విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న విషయాలను గుర్తు చేస్తున్నారు.

బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం
బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. తొలిసారిగా  ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. మెజారిటీ పార్లమెంటు సభ్యుల (188 మంది)  మద్దతు లభించడంతో ఆయనను ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ప్రకటించారు. కనీసం 30 మంది కూడా ఎంపీల మద్దతు లేకపోవడంతో రిషి ప్రత్యర్ధి పెన్నీ మోర్డాంట్ చివర్లో పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఏకగ్రీవంగా రిషికి ప్రధాని పదవి ఖరారైంది. రిషికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి తీవ్ర పోటీ ఎదురతుందని గతవారం భావించినప్పటికీ.. ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. దీంతో రిషి సునాక్  ప్రధాని అయ్యేందుకు లైన్ క్లియర్  అయింది. ఈ ఎన్నికలో బ్రిటన్ మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ సైతం రిషి సునాక్ కే మద్దతు ప్రకటించడం విశేషం.