ఈ బుడతడు బోల్ట్‌‌ను మించేలా ఉన్నాడు

ఈ బుడతడు బోల్ట్‌‌ను మించేలా ఉన్నాడు

న్యూఢిల్లీ: జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ గురించి వినే ఉంటారు. పరుగులో చిరుత వేగాన్ని తలపిస్తూ బోల్ట్ స్ప్రింట్ చేసే తీరును చూసి ఎవ్వరైనా మైమరిచిపోవాల్సిందే. ఒలింపిక్స్‌‌తోపాటు ప్రపంచ స్ప్రింట్‌‌ రేసుల్లో ఎన్నో రికార్డులను బోల్ట్ తన పేరిట లిఖించుకున్నాడు. అలాంటి బోల్ట్‌‌ కంటే వేగంగా పరిగెత్తుతానంటున్నాడు ఓ పిల్లాడు. అమెరికాకు చెందిన ఎనిమిదేళ్ల ఆ బుడ్డోడి పేరు రుడాల్ఫ్ ఇంగ్రామ్. అతడ్ని బ్లేజ్ అని కూడా పిలుస్తారు. రన్నింగ్‌‌లో ఇంగ్రామ్ స్పీడ్, స్కిల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్రామ్ గురించి ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. అతడో మెషిన్ లాంటి వాడంటూ ఇంగ్రామ్‌‌ మీద ప్రశంసలు కురిపించాడు.

‘అతడో యంత్రం లాంటి వాడు. పరిగెత్తే సమయంలో అతడి కాళ్లు అస్పష్టంగా కనిపిస్తాయి. కాబోయే ప్రపంచ అత్యంత వేగవంతమైన మనిషి అతడే అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. 1.2 బిలియన్ ప్రజలు ఉన్న మన దేశంలోనూ అలాంటి ట్యాలెంట్ ఎక్కడో ఓ చోట దాగి ఉందేమో కదా? వెలుగులోకి రాని వాళ్లు ఉండే ఉంటారు కదా?’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌‌కు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వావ్, సూపర్బ్ ట్యాలెంట్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.