త్వరలో ఆన్ లైన్ ద్వారా ఆనందయ్య మందులు

త్వరలో ఆన్ లైన్ ద్వారా ఆనందయ్య మందులు
  • నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందులను వీలైనంత త్వరలో ఆన్ లైన్ ద్వారా పంపిణీ ప్రారంభిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు.ఆనందయ్య ఇచ్చే మందుల కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి జనం భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడం.. మరో వైపు కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఇబ్బందులు నివారించేందుకు ఆన్ లైన్ ద్వారా పంపిణీ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆనందయ్య మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూనే పంపిణీ చేయాలని ప్రభుత్వం షరతు విధించింది. అయితే ఈ షరతును అమలు చేయడం కృష్ణపట్నంలో అసాధ్యంగా కనిపిస్తోంది.

ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో జనం ఎగబడి వస్తున్నారు.సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయడం.. చాలా కష్టతరం అని గతంలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాలు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆనందయ్య మందుల పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండడం.. మరో వైపు ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తూనే కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయాలని చెప్పడంతో ఆనందయ్య మందుల తయారీ కూడా సవాల్ గా మారింది. జనం భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కార్లలో బయలుదేరి వస్తామని ప్రతిరోజు గ్రామస్తులకు వందల సంఖ్యలో ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు.

ఈ నేపధ్యంలో మధ్య మార్గంగా ఆన్ లైన్ ద్వారా పంపిణీకి నెల్లూరు జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. మందుల తయారీ.. పంపిణీ విషయాలపై ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు సమావేశమై చర్చించారు. కరోనా నిబంధనలు పాటించడం.. రద్దీని నివారించే అంశాలపైనే చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామన్నారు. త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మందు తయారీకి కొన్ని రోజులు సమయం పడుతుందని..‌. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మందు కోసం ఎవరూ రావొద్దని చక్రధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.