పాట్నా: బిహార్ సీనియర్ పొలిటిషియన్, మోకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ చిన్న కూతురు శివంగి సింగ్ వివాహం పాట్నా జిల్లాలోని నడ్వాన్ గ్రామంలో నవంబర్ 25న జరిగింది. అయితే, ఈ వేడుకలో భోజనం కోసం అతిథులు మినీ యుద్ధం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుమారు 4 నుంచి 5 లక్షల మంది కోసం భోజన ఏర్పాట్లు చేసినప్పటికీ అతిథుల ఒక్కసారిగా ఎగబడటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.
ఫుడ్ కౌంటర్ల దగ్గర అతిథులు ప్లేట్ల కోసం ఒకరిని ఒకరు తోసేసుకున్నారు. మరికొందరు వడ్డించే వరకు కూడా ఆగకుండా వంట పాత్రల నుండే నేరుగా భోజనం పెట్టుకున్నారు. ప్లేట్లు దొరక్కపోవడంతో కొందరు గ్లాసుల్లోనే భోజనం తిన్నారు. 150 రకాల వంటకాలు ఉన్నప్పటికీ కనీసం ఒక్క ప్లేట్ భోజనం దొరకడం ఏదో ఒక పోటీని గెలిచినంత కష్టంగా మారింది. ఎన్నడూ తిండి తిననట్లుగా అతిథులు భోజనం కోసం ఎగబడ్డ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో అతిథుల తీరు, ప్రవర్తనపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్లేట్స్ విసిరేయటం.. గ్లాసుల్లో తినటం.. గిన్నెలపై పడటం.. బీహార్‌లో అంతేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీ కక్కుర్తి తగలెయ్యా.. ఫుడ్ కోసం ప్రాణాలు పోయినా పర్లేదు అన్నట్లు చేస్తున్నారని మరికొందరు సెటైర్లు వేశారు. మరికొందరు నిర్వాహకుల తీరును విమర్శిస్తున్నారు. లక్షల మందిని ఆహ్వానించినప్పుడు దానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు.
4 లక్షల మంది అతిథులు.. 150 రకాల వంటకాలు
అనంత్ సింగ్ తన కూతురు పెళ్లిని భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు 4 లక్షల మంది అతిథులు వచ్చినట్లు అంచనా. కొందరు అంతకంటే ఎక్కువ మందే వచ్చి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అతిథుల రాక కోసం గ్రామంలో ప్రత్యేకంగా 5 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. విందులో మొత్తం 150 రకాల వంటకాలను వడ్డించారు. బిహారీ స్పెషల్ వంటకాలు లిట్టి చోఖా, సిలావ్ ఖాజాతో పాటు ఇడ్లీ, దోశ, పిజ్జా, పాస్తా, బర్గర్, నూడుల్స్, ఆలూ టిక్కీ వంటి వంటకాలను మెనూలో చేర్చారు.
పెళ్లి వేడుకల సందర్భంగా గుర్రపు పందాలను కూడా నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన విజేతకు మహీంద్రా థార్ కారును బహుమతిగా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. రన్నరప్‌లకు బైక్, స్కూటర్లను బహుమతులుగా నిర్ణయించారు. తిలక్ వేడుకలో వరుడు రిషికేశ్ కుమార్ కు రూ.3 కోట్ల విలువైన వైట్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఖరీదైన బహుమతులు, గుర్రపు పందాలు, భారీ ఏర్పాట్ల గురించి ఇంటర్నెట్ లో చర్చ జరిగింది.
