రూ.కోటి జీతం వదిలి రైతుకోసం పాదయాత్ర

రూ.కోటి జీతం వదిలి రైతుకోసం పాదయాత్ర

ఏడాదికి కోటి రూపాయలు సంపాదించే సాప్ట్ వేర్ ఉద్యోగం.. అయినా అతనిలో ఏదో నిరాశ. పుట్టిన ప్రాంతంలో రైతులు పడుతున్న కన్నీటి కష్టాలను చూసి కరిగి పోయాడు. దేశానికి వెన్నెముక అయిన రైతులు అప్పులతో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన చెందాడు. రైతుల కష్టాల కన్నీళ్లను తెలుసుకుంటున్నాడు ఈ సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రతాప్.

అమెరికాలో ఏడాదికి రూ.కోటి సంపాదన 

కరువు రైతును కాపాడుదాం అంటూ టీ షర్ట్ పై రాసుకుని ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తున్న ఇతని పేరు ప్రతాప్. అనంతపూర్ జిల్లా JNTU లో బీటెక్ చదవిన ప్రతాప్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ MS పూర్తి చేసి… ఏడాదికి కోటి రూపాయల వేతనం వచ్చే సాప్ట్ వేర్ జాబ్ సంపాదించాడు. అయినా ప్రతాప్ కి జాబ్ లో సంతృప్తి లేదు. ఆ ఉద్యోగం వదిలేసి సొంత జిల్లాకు వచ్చాడు. కరువు జిల్లాగా పేరున్న అనంతపురంలో రైతుల సమస్యలపై పని చేస్తున్న సెంటర్ ఫర్ కలెక్ట్ డెవలప్ మెంట్ సంస్థను కలిశాడు. జిల్లా అంతటా తిరిగి రైతుల సమస్యలను తెలుసుకున్నాడు ప్రతాప్.

మార్చి 13న పాదయాత్ర మొదలు

అప్పులతో ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా.. రైతుల గోడును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. దేశంలోని రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి అనంతపూర్ జిల్లాకు  మార్చి 13 వ తేదిన పాదయాత్ర మొదలు పెట్టాడు. ప్రతాప్ తో పాటు సెంటర్ ఫర్ కలెక్ట్ డెవలప్ మెంట్ ఎన్జీవో వాలంటీర్లు భాస్కర్, పరమేశ్ లు నడుస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో తిరుగుతూ వేలాది మంది రైతుల కష్టనష్టాలను తెల్సుకున్నానని చెప్తున్నాడు ప్రతాప్. పాదయాత్రతో రైతులకు అవగహన కల్పించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని అంటున్నాడు.

హైదరాబాద్ లో స్నేహితుల స్వాగతం

హైదరాబాద్ చేరుకున్న ప్రతాప్ కు స్నేహితులు స్వాగతం పలికారు. దేశంలోని రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అంటున్నాడు ప్రతాప్.

కాన్సెప్ట్ నచ్చి వాలంటీర్ల సాయం

రైతుల కోసం పని చేస్తున్న ప్రతాప్ కు ఉడుతా భక్తిగా సాయం చేయడానికి వాలంటీర్లుగా అండగా నిలుస్తున్నారు. రైతుల కోసం తమ సంస్థ పని చేస్తున్నందున… ప్రతాప్ కాన్సెప్ట్ నచ్చి అతనితో పాదయాత్ర చేస్తున్నామంటున్నారు సెంటర్ ఫర్ కలెక్ట్ డెవలప్ మెంట్ మెంబర్స్.

రైతుల సమస్యలను పరిష్కారించాలని ఢిల్లీ నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తున్న ప్రతాప్ ను అభినందించారు రైతు నాయకులు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అమెరికాలో ఉన్నత ఉద్యోగం వదిలేసి రైతుల కోసం ప్రతాప్ ఆలోచించడం గొప్ప విషయమన్నారు.

దేశానికి వెన్నెముక, రైతేరాజు అని చెప్పే పాలకులు.. అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తున్నా.. రైతు సమస్యలపై పోరాడుతున్న ప్రతాప్ నిజంగా అభినందనీయుడు.