జీవుడు శరీరం విడిచాక పితృదేవతగా పిలవబడేది ఏంటి?అతని సూక్ష్మ శరీరమా?మరి అది ఇంకో దేహాన్ని పొందుతుంది కదా? మరి పూర్వీకులను బాధ్రపదమాసం చివరి రోజు ఎందుకు పూజించాలి. మహాలయ పక్షాలకు పితృదేవతలకు సంబంధం ఏమిటి.. 2026 అక్టోబర్ 10 వ తేదీన పూర్వీకులకు ఎందుకు తర్పణాలు ఇవ్వాలి. మొదలగు సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. . .!
మనిషి మరణించినప్పుడు కేవలం కంటికి కనిపించే స్థూల శరీరాన్ని మాత్రమే వదిలేస్తాడు. కానీ జీవుడు తన కర్మలను, వాసనలను , అనుభవాలను మూటగట్టుకుని 'సూక్ష్మ శరీరం.. 'కారణ శరీరం' రూపంలో ప్రయాణిస్తాడు. ఇది స్థూల భౌతికత నుంచి సూక్ష్మ భౌతికతకు జరిగే ఒక పరిమాణాత్మక మార్పు . దేహం లేని సూక్ష్మ స్థితిలో ఉన్న మన పూర్వీకులనే మనం 'పితృదేవతలు' అని పిలుస్తాం.
గీతలో చెప్సిన విధంగా ఆ జీవుడు ఇంకో దేహాన్ని పొందుతాడనే విషయంలో మాత్రంకచ్చితంగా పొందుతాడు. కర్మల ఆధారంగా జీవుడు మళ్లీ జన్మ తీసుకుంటాడు. కానీ, ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి
పరివర్తనా దశ : జీవుడు ఒక భౌతిక దేహాన్ని వదిలేసిన తర్వాత, వెంటనే మరో దేహాన్ని ధరించడం అందరి విషయంలోనూ జరగదు. వారి కర్మల తీవ్రతను బట్టి, ఆ జీవుడు కొత్త దేహాన్ని వెతుక్కునే వరకు కొంతకాలం సూక్ష్మ శరీరంతోనే ఉండిపోతాడు.
ఈ దశలో వారికి భౌతిక శరీరం ఉండదు కానీ, గత జన్మ తాలూకు కోరికలు, బంధాలు, ఆకలి దప్పులు సూక్ష్మ స్థాయిలో అలాగే ఉంటాయి. ఆ సమయంలో వారు పడే ఘర్షణను తగ్గించి, వారి తదుపరి ప్రయాణం సాఫీగా సాగేలా చేయడానికి లేదా వారు ముక్తి వైపు అడుగులు వేయడానికి సహాయపడే ఉద్దేశ్యంతోనే మనం పితృకర్మలు అంటే శ్రాద్ధాలు, తర్పణాలు మొదలగు వాటిని నిర్వహిస్తుంటాం.
అలా చేయకపోతే సూక్ష్మస్థాయిలో ఉన్న పూర్వీకులు పడే బాధలు.. ఇబ్బందుల వలన ఆగ్రహంతో వారసులను శపించే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఏ పని చేసినా కలిసి రాదు. ప్రతి విషయంలో కూడా అడ్డంకులు ఏర్పడుతాయి. అలాంటి పితృశాప దోష విముక్తికి మహాలయ పక్షాల్లో వారికి వారు చనిపోయిన తిథి రోజున తర్పణాలు వదలాలని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది. ఒకవేళ తిథి విషయంలో అస్పష్టంగా ఉంటే బాధ్రపదమాసం చివరిరోజైన మహాలలయ అమావాస్య( 2026 అక్టోబర్ 10) రోజున పితృదేవతలకు ఆహారం.. నీరు ఇవ్వాలి.
ఒకవేళ ఆ జీవుడు అప్పటికే మరో జన్మ ఎత్తేసినా సరే, మనం చేసే కర్మలు వృధా కావు. ఎందుకంటే, పితృదేవతలకు మనం ఇచ్చే తర్పణాలు కేవలం ఒక 'వ్యక్తికి' ఇచ్చేవి కావు. అది మనకు ..ఈ దేహాన్ని, జ్ఞానాన్ని అందించిన 'సమిష్టి పూర్వీకుల శక్తికి' మనం అర్పించే కృతజ్ఞతగా భావించాలి.
జన్యుపరమైన అనుబంధం
చనిపోయిన జీవుడు వేరే దేహంలో ఉన్నప్పటికీ, వారితో మనకున్న జన్యుపరమైన, కర్మపరమైన ఋణానుబంధం అలాగే ఉంటుంది. మనం చేసే కర్మల వల్ల ఆ ఋణం తీరిపోయి, మన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి.
జీవుడు శరీరాన్ని వదిలేశాక, కొత్త శరీరాన్ని ధరించే లోపు ఉండే సూక్ష్మ శరీర స్థితినే మనం పితృదేవతలుగా భావిస్తాం. అందుకే మన సంప్రదాయంలో వారిని దేవుళ్లలా పూజించి అక్కడే ఆపేయకుండా, వారి బంధాలను తెంచి, సద్గతి ప్రాప్తించేలా కర్మలు ఆచరించి, వారిని గౌరవప్రదంగా సాగనంపడానికే ప్రాధాన్యత ఇస్తాం. అంతిమ లక్ష్యం స్వర్గమో, మరో జన్మో కాదు. జనన మరణ చక్రాల నుండి విముక్తి పొందడమే! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
