కాంగ్రెస్ 70 ఏళ్లలో దేశానికి ఏం చేసింది?

కాంగ్రెస్ 70 ఏళ్లలో దేశానికి ఏం చేసింది?

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయి తమకు ఉందా అని కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధి గురించి కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌‌కు లేదని రాజ్యసభలో షా ఫైర్ అయ్యారు. ‘జమ్మూ కశ్మీర్‌ విభజన జరిగిన తర్వాత ఈ 17 నెలల్లో మోడీ సర్కార్ ఏం చేసిందని కాంగ్రెస్ నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. మరి తాము అధికారంలో ఉన్న 70 ఏళ్లల్లో కశ్మీర్‌‌కు, ఈ దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా సరిగ్గా పని చేశారా? మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. కాంగ్రెస్‌‌ లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇచ్చేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్‌‌కు మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉందో లేదో ఆ పార్టీ లీడర్స్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జమ్మూ కశ్మీర్‌‌కు తగిన సమయంలో తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తాం. కశ్మీర్‌‌లో శాంతి నెలకొల్పడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని షా స్పష్టం చేశారు.