ఆర్నెళ్లుగా మురుగుపారుతుంటే కనిపించట్లేదా..? : అందెల శ్రీరాములు యాదవ్

ఆర్నెళ్లుగా మురుగుపారుతుంటే కనిపించట్లేదా..? : అందెల శ్రీరాములు యాదవ్

బడంగ్​పేట, వెలుగు: ఆరు నెలలుగా డ్రైనేజీ మురుగు రోడ్డుపై పారుతుంటే జల్​పల్లి మున్సిపాలిటీ అధికారులకు కళ్లు కనిపించటం లేదా..? అని బీజేపీ మహేశ్వరం సెగ్మెంట్ ఇన్​చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ప్రశ్నించారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధి శ్రీరామ్ కాలనీలో ఆయన  పర్యటించగా.. స్థానికులు మురుగు సమస్యపై ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబిత చేసిన అభివృద్ధి మాటల్లోనే తప్ప చేతల్లో లేదని విమర్శించారు.

 స్వయంగా మంత్రికి కూడా స్థానిక మహిళలు డ్రైనేజీ సమస్యను చూపిస్తే, ఇప్పటివరకు పరిష్కరించలేదని మండిపడ్డారు. కిలోమీటర్ల మేర రోడ్డుపై మురుగు పారుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.10 రోజుల్లోగా సమస్యను పరిష్కరించకుంటే స్థానికులతో కలిసి ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. పార్టీ జల్ పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు కపిల్ గౌడ్, కౌన్సిలర్లు శ్రీధర్ గౌడ్, యాదగిరి, శాంతకుమార్ తదితరులు ఉన్నారు.