
15 మంది సిబ్బందిని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు
అమరావతి, వెలుగు: మాజీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీని ఏపీ సర్కారు తగ్గించింది. ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు, ముగ్గురు ఆర్ఐలతోపాటు 15 మంది సిబ్బందిని వెనక్కి తీసు కుంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు కాన్వాయ్ లో ఎస్కార్ట్, పైలెట్ క్లియరెన్స్ వాహనాలను గతంలోనే తొలగించిన ప్రభుత్వం ఆయన కుటుంబీకులకు సెక్యూరిటీని పూర్తిగా ఎత్తివేసింది. చంద్రబాబుకు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఎత్తివేసింది. 2003లో అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబుకు జెడ్‌ప్లస్ సెక్యూరిటీతోపాటు ఎన్‌ఎస్‌జీ కమాండోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. తర్వాత చంద్రబాబు అధికారం కోల్పోయినా ఇద్దరు సీఎస్‌వోలతో జెడ్ ప్లస్, ఎన్‌ఎస్‌జీ కమాండోలను గత ప్రభుత్వాలు కొనసాగించాయి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ బాబుకు అడిషనల్ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐలతో కలిపి 15 మందితో సెక్యూరిటీ కల్పించేవారు.బాబుకు సెక్యూరిటీ తగ్గించడంపై టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.