గల్లా పట్టుకుని అమెరికా నుంచి గెంటేయాల్సింది: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‎పై మైఖేల్ రూబిన్ ఫైర్

గల్లా పట్టుకుని అమెరికా నుంచి గెంటేయాల్సింది: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‎పై మైఖేల్ రూబిన్ ఫైర్

వాషింగ్టన్: పాకిస్థాన్ అణ్వాయుధ దేశమని.. తమ దేశ అస్థిత్వానికి ప్రమాదం వస్తే తమతో పాటు సగం ప్రపంచాన్ని కూడా తీసుకెళ్తామన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలను పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ తీవ్రంగా ఖండించారు. అమెరికా గడ్డ మీద నుంచి అణ్వాయుధ బెదిరింపులకు దిగిన అసిమ్ మునీర్‎ను యూఎస్ నుంచి వెంటనే తరిమేయాల్సిందని హాట్ కామెంట్ చేశారు. అసిమ్ మునీర్ సూట్‎లో ఉన్న ఓసామా బిన్ లాడెన్ అని అభివర్ణించాడు. 

పాకిస్తాన్‌ను ఒక మోసపూరిత దేశమని విమర్శించాడు. మునీర్ చేసిన అణ్వాయుధ హెచ్చరికలు ఆమోదయోగ్యం కాదని.. అతడు పాక్ ఐఎస్ఐ, అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ల మాదిరిగానే ప్రకటనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో ఒక దేశ బాధ్యతలను పాకిస్థాన్ నిర్వర్తించగలదా అనే సందేహాలు లేవనెత్తుతోందన్నారు. 

అసిమ్ మునీర్ వ్యాఖ్యలు అచ్చం ఇస్లామిక్ దేశాలు మాదిరిగానే ఉన్నాయన్నారు. అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడ్డ పాకిస్తాన్‌కు నాటోయేతర ప్రధాన మిత్రదేశ హోదాను తొలగించాలని, ఉగ్రవాదానికి స్పాన్సర్ చేసే దేశంగా పాకిస్థాన్‎ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను నాన్-గ్రాటా పర్సనాగా ప్రకటించించి.. అతడు అమెరికా వీసాలు పొందకుండా నిషేధించాలని కోరాడు. అమెరికన్లు ఉగ్రవాదాన్ని మనోవేదనతో చూస్తారని.. చాలా మంది ఉగ్రవాదుల సైద్ధాంతిక ఆధారాలను వారు అర్థం చేసుకోరని పేర్కొన్నారు. 

అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫ్లోరిడాలోని టంపాలో అమెరికా సైనిక అధికారులతో జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికా గడ్డ మీద నుంచి భారత్‎పై కవ్వింపు చర్యలకు దిగాడు. పాకిస్థాన్ అణ్వాయుధ దేశమని.. భారత్ నుంచి మా దేశ అస్థిత్వానికి ముప్పు వాటిల్లితే మాతో పాటు సగం ప్రపంచాన్ని కూడా తీసుకెళ్తామని బరితెగింపు మాటలు మాట్లాడాడు. 

అమెరికా సాక్షిగా అణు యుద్ధం చేస్తామని బెదిరింపులకు దిగిన మునీర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అండ చూసుకుని పాక్ రెచ్చిపోతుందని భారత్ వంటి దేశాలు ఫైర్ అవుతున్నాయి. పాక్ అణు బెదిరింపులకు బయపడబోమని.. దేశ భద్రత విషయంలో రాజీపడేదేలేదని.. ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.