జస్టిస్ వర్మకు బిగ్ షాక్.. అభిశంసన తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఆమోదం

జస్టిస్ వర్మకు బిగ్ షాక్.. అభిశంసన తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఆమోదం

న్యూఢిల్లీ: ఇంట్లో నోట్ల కట్టలతో పట్టుబడ్డ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్‎లో అభిశంసన ప్రక్రియ మొదలైంది. జస్టిస్ వర్మపై అభిశంసన కోరుతూ 146 మంది ఎంపీలు సంతకాలు చేసి ఇచ్చిన తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేశారు స్పీకర్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, న్యాయవాది బి.వి. ఆచార్యలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా తన నివేదికను సమర్పిస్తుందని.. రిపోర్టు ఇచ్చే వరకు ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. 

ముగ్గురు సభ్యులతో కూడిన ఈ ప్యానెల్ కమిటీ విచారణ జరిపి నివేదికను స్పీకర్‎కు సమర్పించనుంది. ప్యానెల్ కమిటీ రిపోర్టును స్పీకర్ లోక్ సభ ముందుంచనున్నారు. ఈ రిపోర్టుపై ఉభయ సభల్లో చర్చించి అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. న్యాయమూర్తిని అభిశంసించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం.. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఓటింగ్ సమయంలో సభకు హాజరైన సభ్యుల్లో కనీసం మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతు ఇస్తే అభిశంసన తీర్మానం ఆమోదం పొందుతోంది. జస్టిస్ వర్మ తొలగింపుపై అధికార, ప్రతిపక్ష రెండు కూటములు ఏకగీవ్రంగా ఉండటంతో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందటం లాంఛనమే. 

కాగా, 2025 మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఒక గదిలో భారీగా కాలిన, పాక్షికంగా కాలిన కరెన్సీ నోట్ల కట్టలు లభించాయి. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు రూ. 15 కోట్ల వరకు నగదు బయటపడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా విచారణకు ఆదేశించారు. 

దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. పంజాబ్-హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ జీఎస్ సందావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‎లతో త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీ దాదాపు 50 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. ఇందులో జస్టిస్ వర్మ కుమార్తె, ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా, ఢిల్లీ అగ్నిమాపక దళం చీఫ్ అతుల్ గార్గ్‎ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నగదు లభించిన స్టోర్‌రూమ్‌కు సంబంధించి వీడియోలు, ఫోటోలను కూడా ఈ కమిటీ పరిశీలించింది.

 జస్టిస్ వర్మ నివాసంలోని స్టోర్‌రూమ్‌లో భారీగా నగదు లభించిందని, ఈ నగదును బయటవారికి తెలియకుండా ఉంచడానికి ప్రయత్నించారని కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. మరోవైపు ఇంట్లో నోట్ల కట్టలతో పట్టుబడ్డ యశ్వంత్ వర్మను తొలగించడానికి పార్లమెంట్‎లో అభిశంసన నోటీస్ ఇచ్చారు అధికార, ప్రతిపక్ష ఎంపీలు. ఈ తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలపడంతో అభిసంశన ప్రక్రియ మొదలైంది.