
వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఏంటో రివీల్ చేశాడు. 2016 టీ20 ప్రపంచ కప్ సెమీస్‌లో భారత్‌పై సాధించిన విజయాన్ని తన కెరీర్‌లో ఒక మధురమైన క్షణమని మనసులో మాట చెప్పాడు ఈ విధ్వంసకర ఆల్ రౌండర్. భారత్‌లో జరిగిన ఆ సెమీస్ మ్యాచులో స్టేడియంలోని ప్రేక్షకులంతా భారత్‌కు మద్దతుగా ఉండటంతో మేం కొంత ఒత్తిడికి గురయ్యాం.. కానీ పిచ్ బ్యాటింగ్‌కు సహకరించడంతో ఆ మ్యాచులో గెలుస్తామని మాకు నమ్మకం ఉందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
ఆ మ్యాచులో మా జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ ఉండటంతో తాను స్వేచ్ఛగా ఆడానని చెప్పాడు రస్సెల్. ఆ మ్యాచ్ జ్ఞాపకాలను తనతో పాటే ఇంటికి తీసుకొచ్చుకున్నానన్నాడు. 2016 టీ20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో సెమీస్ పోరులో భారత్, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 192 పరుగులు చేసింది.
వెస్టిండీస్ 193 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించి సెమీస్ లో భారత్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచులో రస్సెల్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 20 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో కీలకమైన అజింక్య రహానే వికెట్ తీశాడు. ఇక, సెమీస్‌లో భారత్‌పై గెలిచి ఫైనల్ చేరిన కరేబియన్ జట్టు.. ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ను ఓడించి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.