ఉద్యోగ భద్రతపై ఆందోళనలో అంగన్ వాడీ వర్కర్లు

ఉద్యోగ భద్రతపై ఆందోళనలో అంగన్ వాడీ వర్కర్లు

ఆదేశాలు లేకున్నా..  జోరుగా ప్రచారం
ఉద్యోగ భద్రతపై  ఆందోళనలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు
జిల్లా పరిధిలో 912 సెంటర్ల ద్వారా సేవలు

హైదరాబాద్‍, వెలుగు: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్‍వాడీ సెంటర్ల భవితవ్యంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదు. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‍ వాడీ సెంటర్లలో గర్భిణులు, బాలింతలు 10 మంది, చిన్నారులు సంఖ్య 20 కంటే తక్కువగా ఉన్న సెంటర్ల వివరాలను సెంటర్ల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. అదే సమయంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంఖ్య తక్కువగా ఉన్న అంగన్‍వాడీ సెంటర్లను మూసివేయడం లేదా విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఆయా సెంటర్లలో పనిచేస్తున్న అంగన్‍వాడీ వర్కర్స్, అంగన్‍వాడీ హెల్పర్స్ ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. అంగన్‍ వాడీ సెంటర్ల విలీనం/మూసివేతపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.

కీలక సేవల్లో వీరి భాగస్వామ్యం

సెంటర్లలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల హాజరు తీసుకోవడంతోపాటు వారికి అవసరమైన ఇతర సేవలు వర్కర్లు, హెల్పర్లు  అందిస్తున్నారు. ఓటర్‍ లిస్ట్ అప్‍డేషన్‍ వర్క్, పోలియో నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, త్వరలో జరుగనున్న జనాభా లెక్కింపు వంటి ప్రోగ్రామ్‍లను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వీరి భాగస్వామ్యం కీలకం. వీటికితోడు బడి బయట బడీడు పిల్లలు, ప్రత్యేక అవసరాల గల పిల్లలను గుర్తించడంలోనూ విద్యాశాఖాధికారులకు వీరు సహయ పడుతుంటారు. వివిధ రకాల జబ్బులపై, హెల్త్ స్కీంలపై హెల్త్ డిపార్ట్ మెంట్‍ చేపట్టే పలు స్కీంలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు వీరు కృషి చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నామని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విలీన/మూసివేత నిర్ణయం తీసుకోవద్దని పలువురు అంగన్‍వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వివిధ సేవలకు నిలయంగా కేంద్రం

చిన్నారుల్లో పోషకాహార లోపాలను అరికట్టేందుకు, వారికి సరైన ఆహారాన్ని అందించి  ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం 1975 అక్టోబరు 2న ఇంటిగ్రేటేడ్‍ చైల్డ్ డెవలప్‍మెంట్‍ సర్వీస్‍(ఐసీడీఎస్‍) ప్రోగ్రామ్‍ను ప్రారంభించింది. అంగన్‍వాడీ సెంటర్లు బేసిక్‍ హెల్త్ కేంద్రాలుగా కూడా సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పౌష్టికాహారంతోపాటు నాన్‍ ఫార్మల్‍ ప్రీ స్కూల్‍ ఎడ్యుకేషన్‍, న్యూట్రిషియన్‍ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్‍, ఇమ్యూనైజేషన్‍ సేవలు, హెల్త్ చెకప్‍ లాంటి సేవలను అందిస్తున్నారు. సమీప కాలనీలు, బస్తీల వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉన్న అంగన్‍వాడీ సెంటర్లను బలోపేతం చేయాల్సింది పోయి వాటిని వీలినం/మూసివేయడం చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుండం పట్ల సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా సంక్షేమాధికారులు వద్ద ప్రస్తావించగా అంగన్‍వాడీ సెంటర్ల విలీనం, మూసివేతలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు.

59 వేల మంది లబ్ధిదారులు

హైదరాబాద్‍ జిల్లా పరిధిలో మొత్తం 5 ఐసీడీఎస్‍ ప్రాజెక్టులు ఉన్నాయి. చార్మినార్‍ ప్రాజెక్టు పరిధిలో 257 అంగన్‍వాడీ సెంటర్లు సేవలందిస్తున్నాయి. అదే విధంగా గొల్కోండ ప్రాజెక్టు పరిధిలో 154, ఖైరతాబాద్‍ ప్రాజెక్టు కింద 141, నాంపల్లి ప్రాజెక్టు పరిధిలో 191, సికింద్రాబాద్‍ ప్రాజెక్టు పరిధిలో 169 సెంటర్లతోపాటు 2 మిని అంగన్‍వాడీ సెంటర్లున్నాయి. వీటి పరిధిలో 887 అంగన్‍వాడీ వర్కర్స్, 839 అంగన్‍వాడీ హెల్పర్స్ పనిచేస్తున్నారు. అంగన్‍ వాడీ సెంటర్ల ద్వారా ప్రతిరోజు సుమారు 59443 మంది పౌష్ఠికాహారాన్ని అందుకుంటున్నారు.