ఖర్చు బారెడు.. ఇచ్చేది మూరెడు !

ఖర్చు బారెడు.. ఇచ్చేది మూరెడు !
  • అంగన్​వాడీ సెంటర్లకు తక్కువ మొత్తం చెల్లిస్తున్న సర్కారు
  • కిలో కూరగాయలకు రూ.30
  • గ్యాస్ సిలిండర్ కు రూ.500
  • నచ్చినప్పుడు బిల్లులిస్తున్న ఆఫీసర్లు

నల్గొండ, వెలుగు : అంగన్​వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు పెట్టే పౌష్టికాహారానికి టీచర్లు రూ.వందల్లో ఖర్చు చేస్తుంటే సర్కారు మాత్రం చాలా తక్కువ మొత్తం కట్టిస్తోంది. బయట మార్కెట్​లో కూరగాయల ధరలు మండిపోతున్నా, వంట గ్యాస్ ​ధరలు కొండెక్కినా కొన్నేండ్ల క్రితం ఫిక్స్​చేసిన రేట్లనే చెల్లిస్తోంది. ఈ ధరలు గిట్టుబాక టీచర్లు అప్పులపాలవుతుంటే..మరోవైపు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారంలో కోత పడుతోంది.  

చౌక కూరగాయలతో ‘ఆరోగ్యలక్ష్మి’ 
ప్రభుత్వం అంగన్​వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టగా, గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేండ్ల చిన్నారులకు ఒకపూట భోజనం పెడుతున్నారు. ఇందులో భాగంగా సెంటర్లకు అవసరమయ్యే బియ్యం, పప్పు, వంటనూనెలను ప్రభుత్వమే సప్లై చేస్తోంది. కానీ కూరగాయలు, పోపు గింజలు, వంట గ్యాస్ వగైరా అంగన్ వాడీ టీచర్లే కొనుక్కోవాలి. అయితే ఎప్పుడో గానీ ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు. పైగా సర్కారు నిర్ణయించిన రేట్లకు మించి ఒక్క పైసా అదనంగా ఖర్చుపెట్టినా ఆ భారాన్ని టీచర్లే మోయాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల రేట్లు గిట్టుబాటు కావడం లేదని, మార్కెట్​లో చౌకగా దొరికే కూరగాయలతోనే భోజనం పెడుతున్నారు. మరోవైపు పెట్టిన ఖర్చులకు ఏడాది నుంచి బిల్లులు రావడం లేదని, దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

50 గ్రాములకు రూపాయిన్నర
ఆరోగ్యలక్ష్మి స్కీం కింద ఒక్కొక్కరికి ఒక పూటకు 50 గ్రాముల కూరగాయలు వండిపెట్టాలి. దీనికి ప్రభుత్వం రూపాయిన్నర మాత్రమే ఇస్తోంది. అంటే కిలో కూరగాయలకు రూ.30 చెల్లిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనిషి తినే ఆహారంలో ప్రతి రోజు కూరగాయలు, పండ్లు కలిపి 500 గ్రాములుండాలి. ఒక్క కూరగాయలే అయితే కనీసం 230 గ్రాములుండాలి. ఈ లెక్కన అంగన్​వాడీ కేంద్రాల్లోని గర్భిణులకు పెట్టే ఒక్కపూట భోజనంలో కూరగాయలు 115.5 గ్రాములుండాలి. ఇది మామూలు మనుషులకు మాత్రమే. అదే గర్భిణులు, బాలింతలకు ఇంకింత ఎక్కువే ఉండాలి. కానీ వంద గ్రాములు కూడా పెట్టకుండా కేవలం 50 గ్రాములతోనే సరిపెడుతున్నారు. దీనికి సర్కార్ చెల్లిస్తున్న ధర కిలోకు రూ.30. కానీ మార్కెట్​లో టమాటతో సహా అన్ని రకాల కూరగాయలు కేజీ రూ.50 నుంచి 70 పలుకుతున్నాయి. తక్కువలో తక్కువ చిక్కుడు, బీరకాయ, బెండకాయ వంటి కూరగాయల ధర  రూ.60 నుంచి రూ.70 నడుస్తోంది. హైదరాబాద్ లాంటి చోట్ల అయితే టమాటతో సహా ఏదైనా రూ వంద, రూ.80 పెట్టందే దొరకడం లేదు. ఇక పిల్లలకు ఇచ్చే ఆహారంలో కూరగాయల శాతం మరీ దారుణంగా ఉంటోంది. మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు 25 గ్రాముల కూరగాయలే ఇస్తున్నారు. దీనికి సర్కారు చెల్లించేది రూ.70 పైసలు మాత్రమే. 

వంటగ్యాస్​ సగానికి పైగా నష్టం
వంటగ్యాస్ ధర ప్రస్తుతం రూ.1,120 ఉండగా ప్రభుత్వం రూ.500కు మించి ఇవ్వడం లేదు. ఈ డబ్బులు కూడా రెండు నెలలకోసారి మాత్రమే ఇస్తున్నారు. పైగా సబ్సిడీ కూడా లేదు. మొత్తం కట్టాల్సిందే. సెంటర్ కెపాసిటీని బట్టి గ్యాస్ 40, 50 రోజుల్లో అయిపోతుందని,  కానీ, ప్రభుత్వం ఇచ్చే రేట్ల ప్రకారం చూస్తే సగటున గ్యాస్ ధర రూ.500కు మించి గిట్టుబాటు కావడం లేదని, ఆ పైన భారమంతా తామే భరించాల్సి వస్తోందని టీచర్లు వాపోతున్నారు. 

తనిఖీల పేరుతో బెదిరింపులు
కూరగాయలు, గ్యాస్ రేట్లు గిట్టుబాటు కావడం లేదని, రేట్లు పెంచాలని అడిగితే అధికారులు తమను టార్గెట్ చేస్తున్నారని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీ పేరుతో సెంటర్లకు వచ్చి చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో 9 ప్రాజెక్టులుండగా ఐదు ప్రాజెక్టుల పరిధిలోని సెంటర్లకు మత్రమే బిల్స్ ఇచ్చారు. నల్గొండ అనుముల, చింతపల్లి, మునుగోడు ప్రాజెక్టుల పరిధిలోని సెంటర్లకు గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు. ఒక్క ప్రాజెక్టు పరిధిలో సుమారు రూ. రెండు లక్షలు బకాయి ఉంది. ట్రెజరీలో బిల్స్ పైన ఫ్రీజింగ్ పెట్టడం వల్లే పేమెంట్స్ ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని సెంటర్లలో అయితే 2020 లక్ డౌన్ ముందు నుండి కూడా పేమెంట్ చేయలేదు.