అంగన్వాడీ ఆన్ వీల్స్..అన్ కవర్డ్ ఏరియాలకు మొబైల్ సేవలు

అంగన్వాడీ ఆన్ వీల్స్..అన్ కవర్డ్ ఏరియాలకు మొబైల్ సేవలు
  • అడ్వాన్స్​డ్ వెహికల్స్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ
  • గ్రేటర్​తో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ సేవలు
  • 37 వెహికల్స్​ను  సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: 
అంగన్‌‌‌‌వాడీ సేవలు అందని మారుమూల బస్తీలు, కొత్తగా వెలిసిన కాలనీల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. 

గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో అంగన్​వాడీ సెంటర్లు కవర్ కాని ప్రాంతాలకు ‘మొబైల్ అంగన్‌‌‌‌వాడీ సెంటర్లు’ ద్వారా సేవలు అందించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. 

ఈ మేరకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రతిపాదనల సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. ఆమోదం లభించిన వెంటనే.. మొబైల్ అంగన్​వాడీ వెహికల్స్ రోడ్డెక్కనున్నాయి. బస్తీల్లోని గల్లీ గల్లీ తిరుగుతూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించనున్నాయి. 

ప్రస్తుతం ఉన్న అంగన్‌‌‌‌వాడీ సెంటర్ల పరిధిలోకి రాని ప్రాంతాల్లో... ప్రత్యేకంగా రూపొందించిన వ్యాన్ల ద్వారా సేవలను అందించనున్నారు. ఈ మొబైల్ అంగన్‌‌‌‌వాడీ యూనిట్లను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది నిరుపేద తల్లులు, చిన్నారులకు పౌష్టికాహారం అందనున్నది.

37 అడ్వాన్స్​డ్ మొబైల్ యూనిట్స్

తొలిదశలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల సహకారంతో 37 అడ్వాన్స్​డ్ మొబైల్ వ్యాన్‌‌‌‌లను సిద్ధం చేయనున్నారు. ఈ వ్యాన్‌‌‌‌లు కేవలం పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడమే కాకుండా.. చిన్నపాటి హెల్త్ సెంటర్ల మాదిరి కూడా పని చేస్తాయి. ప్రతి మొబైల్ యూనిట్‌‌‌‌లో పౌష్టికాహార వస్తువులు, పాలు, గుడ్లు వంటి టేక్ హోమ్ రేషన్ ప్యాకేజీలు సిద్ధంగా ఉంటాయి. 

అలాగే.. ఈ వ్యాన్‌‌‌‌ లలో ప్రైమరీ హెల్త్ కిట్, పిల్లల ఎత్తు, బరువు కొలవడానికి అవసరమైన పరికరాలు ఉంటాయి. ప్రతి మొబైల్ వెహికల్‌‌‌‌ కు ఒక అంగన్‌‌‌‌ వాడీ టీచర్, ఒక ఆయా (హెల్పర్) ఉంటారు. 

వీరు ఆయా బస్తీల్లో షెడ్యూల్ ప్రకారం పర్యటించి.. లబ్ధిదారుల ఇండ్లకు పౌష్టికాహారాన్ని అందజేయడమే కాకుండా, గర్భిణులకు ఆరోగ్య సలహాలు, పిల్లల సంరక్షణపై తల్లులకు సూచనలు ఇస్తారు. అంగన్‌‌‌‌వాడీ టీచర్లు ప్రభుత్వ ఆరోగ్య పథకాల గురించి అవగాహన కల్పించి, అవసరమైన వారికి స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్లతో సమన్వయం చేస్తారు.

కేంద్రం నుంచి నో రెస్పాన్స్.. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ


ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ లోని 3 జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 4,812 అంగన్‌‌‌‌వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా సుమారు 1.94 లక్షల మంది చిన్నారులు ప్రీ-స్కూల్ విద్యను అభ్యసిస్తూ, పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. అయితే, గత కొన్నేండ్లుగా సిటీలు, శివారు ప్రాంతాలు వేగంగా విస్తరించాయి. వందలాది కొత్త బస్తీలు, కాలనీలు ఏర్పడ్డాయి. 

దీంతో చాలా ప్రాంతాలకు అంగన్‌‌‌‌వాడీ సేవలు అందుబాటులో లేవు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నిర్వహించిన సర్వేలో ఈ 4 జిల్లాల్లో 274 అన్‌‌‌‌ కవర్డ్ ఏరియాలున్నాయని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో కొత్త అంగన్‌‌‌‌వాడీ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. 

అయితే.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సీఎం రేవంత్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. దీంతో మొబైల్ అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే.. మొబైల్ అంగన్​వాడీ సెంటర్లు రోడ్ల మీద పరుగులు పెట్టనున్నాయి.