అప్లికేషన్లను స్వీకరించినా.. పూర్తి కాని భర్తీ ప్రక్రియ

అప్లికేషన్లను స్వీకరించినా.. పూర్తి కాని భర్తీ ప్రక్రియ

సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు :  ఉమ్మడి మెదక్​ జిల్లాలో అంగన్​వాడీ టీచర్లు, ఆయాల నియామకాల ప్రక్రియ ముందుకు కదలడం లేదు. మొత్తం 500కు పైగా పోస్టులు ఖాళీ ఉండగా, అందుకు 5800కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లను గతేడాది సెప్టెంబర్​లో  స్వీకరించినా ఇంకా భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. 

జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. 

సిద్దిపేట జిల్లాలో పరిధిలో మొత్తం 1150 అంగన్ వాడీ కేంద్రాలుండగా అందులో 66 మినీ, 1084 ప్రధాన కేంద్రాలున్నాయి. వీటిలో  22 ప్రధాన అంగన్ వాడీ కేంద్రాలు, 9 మినీ సెంటర్లు ఉన్నాయి. కాగా జిల్లాలో మొత్తం 126  ఖాళీ పోస్టులలో 31 టీచర్ , 95 ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో టీచర్ పోస్టులకు  1966 మంది, ఆయా పోస్టులకు 682 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆయా ప్రాజెక్ట్ ల పరిధిలో మొత్తం 38 మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఒక మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్, 142 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకు 1,450 దరఖాస్తులు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో 26 టీచర్, హెల్పర్, ఆయా 176, మినీ టీచర్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో టీచర్ పోస్టులకు 520 మంది, ఆయా, హెల్పర్ పోస్టులకు 1,235 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఖాళీ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్​లో దరఖాస్తులు స్వీకరించారు. కానీ నియామకపు ప్రక్రియ మాత్రం ఇంకా ముందుకు సాగడం లేదు. 

సేవలపై ప్రభావం..

అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీల వల్ల  పిల్లలు, గర్బిణులు,  బాలింతలకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దాదాపు ఏడాది కింద ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరించినా ఈ  ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అరకొర సిబ్బందితోనే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలకు విద్యాబుద్దులు చెప్పేందుకు, గర్బిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు ఆరోగ్య సంరక్షణపై సలహాలు, సూచలను ఇచ్చేవారు కరువయ్యారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో టీచర్లు, ఆయాల కొరత కారణంగా కొన్ని కేంద్రాలకు పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. 

మెరిట్ లిస్ట్ రాకనే..

అంగన్ వాడీ టీచర్లు, ఆయాల భర్తీ కి  సంబంధించి  రాష్ట్ర స్థాయి నుంచి మెరిట్ లిస్ట్ రాకపోవడంతో ఈ ప్రక్రియ  నిలిచిపోయినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్ల ప్రకారం టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు  సమర్పించిన వివరాల ప్రకారం రాష్ట్ర స్థాయి అధికారులు మెరిట్ లిస్ట్ ను  సిద్ధం చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం జిల్లాలోని  ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నా రాష్ట్ర స్థాయి నుంచి ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ రాకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఈ నియామకాలకు సంబంధించి రాత, మౌఖిక పరీక్షలు లేవు. మొత్తం వంద మార్కులకు గాను టెన్త్ లో వచ్చిన మెరిట్​మార్కులను బట్టి ఎంపిక ఉంటుంది. ఇందులో దివ్యాంగులు, అనాథలు, వితంతువులకు అదనంగా 20 మార్కులు ఇస్తారు. అయితే వీటిలో టెన్త్ మార్కులకు అధిక ప్రాధాన్యం ఉన్నందున ఎక్కువ మార్కులు ఉన్నవారికే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాధాన్యత ప్రకారం రాష్ట్ర స్థాయిలో మెరిట్ లిస్ట్ ను సిద్ధం చేసి జిల్లా అధికారులకు పంపితే, దాని ప్రకారం సర్టిఫికెట్లను పరిశీలించి మెరిట్ లిస్ట్ లో ముందున్న వారికి ఈ పోస్టులు ఇస్తారు. అయితే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

మెరిట్​ లిస్ట్ వచ్చిన వెంటనే ప్రక్రియ పూర్తి చేస్తాం

మెరిట్ లిస్ట్ లను రెడీ చేయకపోవడంతో  రాష్ట్ర స్థాయిలో నియామక ప్రక్రియ నిలిచిపోయింది.  ఆ లిస్ట్ లు రాగానే జిల్లాలో అంగన్ వాడీ ఆయా, టీచర్ పోస్టుల నియామకపు ప్రక్రియను పూర్తి   చేస్తాం. 

– రాంగోపాల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా సంక్షేమ అధికారి