పాత ఫోన్లతో అంగన్‌‌ వాడీల కుస్తీ..ఫోన్ల స్థానంలో ట్యాబ్స్‌ ఇవ్వాలని అంగన్‌‌వాడీల డిమాండ్

పాత ఫోన్లతో అంగన్‌‌ వాడీల కుస్తీ..ఫోన్ల స్థానంలో ట్యాబ్స్‌ ఇవ్వాలని అంగన్‌‌వాడీల డిమాండ్
  • 2019లో 36 వేల స్మార్ట్‌‌ఫోన్లు అందజేత
  • ప్రస్తుతం డిస్‌‌ప్లే పగిలి, బ్యాటరీ ఉబ్బిన ఫోన్లు
  • పోషణ  యాప్‌‌ ఓపెన్ చేస్తే హ్యాంగ్ 
  •  పిల్లలకు అందించే 14 సేవలకు ఆటంకం 
  • ఫోన్ల స్థానంలో ట్యాబ్స్‌ ఇవ్వాలని అంగన్‌‌వాడీల డిమాండ్

హైదరాబాద్,  వెలుగు: రాష్ట్రంలోని అంగన్‌‌వాడీసెంటర్లను స్మార్ట్‌‌గా నిర్వహించాలన్న ఉద్దేశంతో 2019లో పంపిణీ చేసిన సుమారు 36 వేల స్మార్ట్‌‌ఫోన్లు ఇప్పుడు పూర్తిగా డొక్కుగా మారి అంగన్‌‌వాడీ టీచర్లను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఫోన్లలోని పోషణ ట్రాకర్ యాప్‌‌ ద్వారానే పిల్లల అటెండెన్స్, గుడ్లు, పాలు, -బాలామృతం పంపిణీ, గర్భిణుల ఆరోగ్య వివరాలు వంటి 14 రకాల సేవలను రోజూ అప్‌‌డేట్ చేయాల్సి ఉంటుంది.

 కానీ ఇప్పుడీ పాత ఫోన్లు చాలా స్లోగా పనిచేస్తున్నాయి. దాంతో టీచర్లు గంటల తరబడి ఫోన్‌‌తోనే కుస్తీ పడుతున్నారు.ఐదేండ్ల క్రితం ఇచ్చిన ఫోన్లలో డిస్‌‌ప్లేలు పగిలిపోవడం, బ్యాటరీలు ఉబ్బిపోవడం, ఛార్జింగ్ గంట కూడా నిలవకపోవడం, యాప్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాంగ్ అవ్వడం సర్వసాధారణంగా మారింది. 2జీబీ ర్యామ్ ఉన్న ఈ పాత ఫోన్లు ప్రస్తుత పోషణ్ ట్రాకర్ యాప్ అప్‌‌డేట్లకు అస్సలు సరిపోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌‌వర్క్ సమస్యలతో పాటు సర్వర్ డౌన్ కావడంతో డేటా సింక్ కాకపోవడం నిత్యకృత్యమైంది.

డొక్కు ఫోన్లతోనే నెట్టుకొస్తున్నరు

ఫోన్లు సరిగ్గా వర్క్ చేయకపోవడంతో కొందరు అంగన్‌‌వాడీ టీచర్లు  జేబులోంచి వేల రూపాయలు   పెట్టి కొత్త ఫోన్లు కొంటున్నారు. కొందరు పాత డొక్కు ఫోన్లతోనే ఇంకా ఫేషియల్ అటెండెన్స్ వేస్తున్నారు. వారంటీ  ముగిసిపోవడంతో సర్వీస్ లభించడం లేదని.. రిపేర్లకు నయాపైసా రావడం లేదని వాపోతున్నారు. 2జీ నెట్ వర్క్ ఫోన్లతో ప్రాసెసింగ్ లేట్ అవుతుందని చెబుతున్నారు. 

సర్వర్ డౌన్ సమస్యలకు తోడు, ర్యామ్ తక్కువగా ఉండటంతో యాప్ ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాంగ్ అవుతోందన్నారు. పోషణ్ ట్రాకర్ యాప్ ఎప్పటికప్పుడు అప్‌‌ డేట్‌‌ అవుతుంటే .. ఐదేండ్ల క్రితం ఇచ్చిన ఫోన్ల సామర్థ్యం వాటికి ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. రూల్స్ ప్రకారం లైఫ్ టైం గడువు ముగిసిన వెంటనే కొత్త ఫోన్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ... అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. దీంతో తమకు తిప్పలు తప్పడం లేదని అంటున్నారు.

అధికారులకు చాలా సార్లు చెప్పాం

డొక్కు ఫోన్లతో ఇబ్బందులు పడుతున్నట్లు అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లాం. త్వరలోనే కొత్త ఫోన్లు వస్తాయని చెబుతున్నారు. కాని అవి రావడం లేదు. అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టి ఫోన్ల స్థానంలో ట్యాబ్ లు ఇస్తే బాగుంటుంది.- కవిత, రంగారెడ్డి జిల్లా సెక్రటరీ, అంగన్‌‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్