
దివంగత నటుడు కోట శ్రీనివాసరావుకి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఎంతోమంది సినీ సెలబ్రెటీలు వచ్చారు. ఇందులో డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఉన్నారు. కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని సందర్శించిన తర్వాత రాజమౌళి బాధతో ఇంటి బయటకొచ్చారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది. అసలేమైందనే వివరాల్లోకి వెళితే..
కోటని చూసి భావోద్వేగంతో బయటకొచ్చిన రాజమౌళితో అభిమానులు సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో రాజమౌళి ఎంతో అసౌకర్యంగా ఫిల్ అయ్యారు. ఇందులో ఓ అభిమాని అయితే రాజమౌళికి అడ్డుగా వచ్చాడు. అంతేకాకుండా ఆయనతో పాటే నడుస్తూ కారువరకు వచ్చాడు. వెంటనే సహనం కోల్పోయిన రాజమౌళి, ఆ అభిమానిని దూరంగా తోసేశాడు.
ఫోటోలు దిగడానికి సమయం, సందర్భం లేదా అంటూ ఆ అభిమానిని హెచ్చరిస్తూ నిరాశతో కారులో వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు సైతం ఆ సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. వేదిక, వేదన ఏదీ తెలియకుండా సెలబ్రిటీలపై ఇంతలా అత్యుత్సాహం మంచిదికాదని కామెంట్లు చేస్తున్నారు.
రాజమౌళి తన X ఖాతాలో కోట శ్రీనివాసరావు మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని ట్వీట్ చేశాడు. ‘‘కోట శ్రీనివాసరావు గారు మరణించారని విని చాలా బాధపడ్డాను. ఆయన ప్రతిభకు నిలువెత్తు నిపుణుడు. ఆయన పోషించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన దిగ్గజం. తెరపై ఆయన ఉనికి నిజంగా మరువలేనిది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఓం శాంతి”అని రాజమౌళి ఎక్స్లో సంతాపం తెలిపాడు.
Deeply saddened to hear about the passing of Kota Srinivasa Rao garu. A master of his craft, a legend who breathed life into every character he portrayed. His presence on screen was truly irreplaceable. My heartfelt condolences to his family. Om Shanti.
— rajamouli ss (@ssrajamouli) July 13, 2025
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, వెంకటేష్, రానా దగ్గుబాటి సహా పలువురు తెలుగు సినీ తారలు హాజరై దిగ్గజ నటుడికి నివాళులర్పించారు.
కోట శ్రీనివాస రావు గురించి:
కోట శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌లోని కంకిపాడు గ్రామంలో జూలై 10, 1942న జన్మించారు. 1978లో చిరంజీవి హీరోగా నటించిన ప్రాణం ఖరీదు అనే తెలుగు చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. వివిధ భాషల్లో నాలుగు దశాబ్దాల్లో 750కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. కోట శ్రీనివాస రావు 9 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రతిఘటన సినిమాలో యాక్టింగ్ కు తొలిసారి నంది అందుకున్నారు.