
ముంబై: రెండేళ్ల చిన్నారి. నీళ్లల్లో సరదాగా ఆడుకుంటోంది. అమ్మ వచ్చి నీళ్లల్లో ఆడుకోవద్దని చెప్పింది. ఇంకా మాటలు కూడా సరిగా రాని ఆ చిన్నారి అమ్మ ఏం చెప్పిందో అర్థంకాక నీళ్లల్లో ఆడుకుంటూనే ఉంది. అది చూసి అమ్మకు చాలా కోపమొచ్చింది. పదే పదే చెప్పినా వినిపించుకోవట్లేదనే కోపంతో పాపను నేలకేసి కొట్టింది. దీంతో చిన్నారికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. రక్తం కారుతుండడంతో తల్లి కంగారు పడింది. పరుగున దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. కానీ అప్పటికే ఆ చిన్నారి చనిపోయింది. ముంబైలోని విరార్ తూర్పు ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. తల్లి పేరు నేహా సోని (22). ప్రస్తుతం గర్భవతి. ఆ సంఘటన గురించి తెలియడంతో ఇరుగు పొరుగు వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్లలో ఒకరు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. విరార్ పోలీసులు వచ్చి చిన్నారి డెడ్‌బాడీని జేజే హాస్పిటల్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. చిన్నారి పొట్టలో, తలపై తీవ్ర గాయాలున్నాయని రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు మర్డర్ కేసు పెట్టి తల్లిని అరెస్టు చేశారు. పాపను కొట్టిన విషయాన్ని తల్లి ముందు తమకు చెప్పలేదని పోలీసులు తెలిపారు. నేహా భర్త ఆటో రిక్షా డ్రైవరని, సంఘటన జరిగిన సమయంలో పనికి వెళ్లారని చెప్పారు.