న్యూఢిల్లీ: దేశం వదిలి వెళ్లనని హామీ ఇస్తూ అనిల్ అంబానీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విదేశాలకు వెళ్లాల్సి వస్తే న్యాయస్థానం ముందస్తు అనుమతి తీసుకొని మాత్రమే వెళ్తానని తెలిపారు. రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో రూ.40 వేల కోట్ల బ్యాంకు రుణం మోసం ఆరోపణలపై సీబీఐ, ఈడీలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ఈ కేసులో విచారణకు పూర్తిగా సహకారం అందిస్తానని తెలిపారు.
అయితే విచారణలో ఆలస్యం జరుగుతున్నదని ఫిబ్రవరి 4న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంబానీ దేశం వదిలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అనిల్ దేశం వదిలి వెళ్లడం లేదని ఆయన తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. అయితే ఇప్పుడు అనిల్ అంబానీ స్వయంగా అఫిడవిట్‌లో ఆ విషయాన్ని పేర్కొన్నారు.
