- మోదీ దేశద్రోహి.. ఆయన ట్రంప్ కంట్రోల్లో ఉన్నారు
- ప్రమాదంలో జాతీయ భద్రత
- పశ్చిమ బెంగాల్‌లోని 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం
కోల్‌కతా: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ విద్వేష ఆలోచనా విధానంతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకుంటోందని మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు (సర్) రాజ్యాంగ విరుద్ధమని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్యాయంగా తొలగించిన పేర్లను మళ్లీ చేరుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాయ్‌గంజ్, మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు. " బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ వైఖరితో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి మతం, కులం పేరుతో ఒకరిపై ఒకరిని ఉసిగొల్పుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి.అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌లో విక్రయించడానికి ప్రధాని మోదీ అనుమతించారు. దీనివల్ల మన వ్యవసాయ రంగం నాశనం అవుతుంది. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో మోదీ భారతదేశాన్ని అమ్మేశారు.
ఇక దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడతాయి. మోదీ దేశభక్తుడు కాదు.. దేశద్రోహి" అని రాహుల్ మండిపడ్డారు. దేశ ప్రజల డేటాను మోదీ ప్రభుత్వం అమెరికాకు ఇచ్చేసిందన్న రాహుల్... దీనివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని తెలిపారు. వివాదాస్పద ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తూ మోదీపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ భయం వల్లే మోదీ దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి, అమెరికాకు లాభం చేకూర్చేలా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు.
టీఎంసీ హింస వల్లే బీజేపీ ఎంట్రీ
మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి, నిరంకుశ పాలన సాగించడం వల్లే బెంగాల్‌లో బీజేపీ పట్టు సాధించడానికి మార్గం సుగమమైందని రాహుల్ విమర్శించారు. టీఎంసీ సర్కార్ హింసకు పాల్పడకుండా మంచి పాలన అందించి ఉంటే బీజేపీ ఇక్కడ అడుగుపెట్టేదే కాదన్నారు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మమతా బెనర్జీ విఫలమయ్యారని ఆరోపించారు. బెంగాల్‌లో ప్రస్తుతం 84 లక్షల మంది యువత నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దీన్నిబట్టి రాష్ట్రంలో నిరుద్యోగం ఎంత ఉందో అర్థమవుతోందన్నారు.
తొలగించిన ఓటర్లను చేరుస్తం
‘సర్’ ప్రాసెస్ రాజ్యాంగ విరుద్ధమని రాహుల్ విమర్శించారు. ఈ పేరుతో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ చేరుస్తుందన్నారు. ‘మేం అధికారంలోకి రాగానే బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం ప్రతి పౌరుడికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా, రైతులకు భరోసాగా ఏటా రూ.15,000 ఆర్థిక సాయం, వ్యవసాయ అవసరాల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. అలాగే, మహిళా సాధికారత కోసం ప్రతి మహిళకు నెలకు రూ.2,000 ఇస్తాం" అని రాహుల్ హామీలు ఇచ్చారు.

