V6 News

ఆంధ్రాలో 9 ఎయిర్ పోర్టులు.. తెలంగాణకు ఒక్కటే.. కేంద్రం పట్టించుకోవడం లేదు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఆంధ్రాలో 9 ఎయిర్ పోర్టులు.. తెలంగాణకు ఒక్కటే.. కేంద్రం పట్టించుకోవడం లేదు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లా: తెలంగాణకు  కేంద్రం ఎలాంటి నిధులు మంజూరు చేయాడంలేదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కొత్త విమానాశ్రయాల గురించి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని.. ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 9 విమానాశ్రయాలు ఉండగా తెలంగాణకు కేవలం ఒకటే విమానాశ్రయం ఉందని.. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మంగళవారం (ఏప్రిల్ 14) మంథని పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి, శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావలసిన నిధుల పట్ల కేంద్ర మంత్రులు ప్రశ్నించడం లేదన్నారు.

►ALSO READ | చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో సస్పెండ్...

తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించాలని పార్లమెంట్ లో మాట్లాడుతున్నారే తప్ప తెలంగాణ గురించి మాట్లాడడం లేదని ఆరోపించారు. రామగుండంలో సింగరేణి కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. దీనిపై పార్లమెంట్లో గళం విప్పుతామని తెలిపారు. 

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్లు పెంచడం కొరకు పోరాటం చేస్తామని తెలిపారు. కొన్ని రోజులుగా విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మె గురించి సీఎం రేవంత్ కి వివరించి.. వారి సమస్యలు నెరవేరే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.