
మంగళవారం (ఏప్రిల్ 22) ఏకనా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు రావడం ఆశ్చరానికి గురి చేసింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రావాల్సిన పంత్ ఏకంగా ఏడో స్థానంలో వచ్చి విమర్శల పాలవుతున్నారు. డగౌట్ లో ప్యాడ్ లు కట్టుకొని నిలుచున్నా.. వికెట్ పడుతుంటే తాను రాకుండా వేరే బ్యాటర్ ను పంపించాడు. నాలుగో స్థానంలో సమద్.. ఐదో స్థానంలో మిల్లర్, ఆరో స్థానంలో బదోనిని పంపించాడు.
చివరి ఓవర్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి డకౌటయ్యాడు. పంత్ ఏడో స్థానంలో రావడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అతను బ్యాటింగ్ కు రావడానికి భయపడుతున్నాడా.. లేకపోతే బ్యాటింగ్ కు రాకుండా ఎవరైనా ఆపుతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే పంత్ బ్యాటింగ్ ఆర్డర్ పై టీమిండియా దిగ్గజ స్పిన్ బౌలర్ అనీల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారుతుంది.
కుంబ్లే మాట్లాడుతూ.. " పంత్ బ్యాటింగ్ కు రావడం చాలా ఆలస్యం అయింది. రిషబ్ నిరాశకు గురైనట్టు తెలుస్తుంది. అతనికి అన్యాయం జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. అతను నాకు తెలిసి బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు రావాలనుకున్నాడు. ఇది అతని నిర్ణయమా? లేదా కోచ్ జస్టిన్ లాంగర్ తీసుకున్నదా? లేదా గురువు జహీర్ ఖాన్ తీసుకున్న నిర్ణయమా? ఎందుకంటే పంత్ చాలా నిరాశకు గురైనట్లు కనిపించాడు." అని స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ తర్వాత జరిగిన కుంబ్లే అన్నారు.
ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ. 27 కోట్ల రికార్డ్ ధరకు లక్నో తీసుకుంటే ఘోరంగా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. చూస్తుంటే పంత్ తన మీద తనకు కాన్ఫిడెంట్ పోయిందేమో అనే అనుమానం కలగక మానదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న పంత్ ఇకనైనా గాడిలో పడకపోతే విమర్శలు మూటగట్టుకోవాల్సిందే.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మంగళవారం (ఏప్రిల్ 22) లక్నో సూపర్ జయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఛేజింగ్ లో అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 51: 5 ఫోర్లు, సిక్సర్) కేఎల్ రాహుల్ (57) హాఫ్ సెంచరీలు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్ లో ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలిచింది.