జేపీ నడ్డాతో సహా ఆరుగురు కూడా..
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అనిల్ యాదవ్ ప్రమాణం చేశారు. శనివారం పార్లమెంట్లోని ప్రత్యేక రూమ్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కొత్తగా ఎన్నికైన ఆరుగురు సభ్యులతో ప్రమాణం చేయించారు. రాజ్య సభ ఉపసభాపతి హరివంశ్ నారాయణ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు జేపీ నడ్డా (బీజేపీ) గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర నుంచి అశోక్ రావు శంకర్ రావు చౌవాన్ (బీజేపీ), రాజస్థాన్ నుంచి చున్నిలాల్ గరాసియా(బీజేపీ), వెస్ట్ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సుశ్మిత దేవ్ (ఏఐటీసీ), మహ్మద్ నదిముల్ హక్ (ఏఐటీసీ) ప్రమాణం చేశారు. అనంతరం నూతన సభ్యులతో కలిసి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఫొటో దిగారు.
స్టూడెంట్ లీడర్ నుంచి రాజ్యసభకు..
2015 నుంచి 2018 వరకు కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అనిల్ యాదవ్ పనిచేశారు. 2018లో ముషీరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2023లో పార్టీ ఆయనను సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇటీవల తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా, ఇందులో ఒక స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్కు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. రాజ్యసభ ఎన్నికల్లో అనిల్ ఎన్నికవడంతో ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.