- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
తాడ్వాయి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. గురువారం తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క, సారలమ్మను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి దర్శించుకున్నారు. హరిత హోటల్ లో మేడారం మాస్టర్ ప్లాన్, జంపన్న వాగు అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, గోదావరి పుష్కరాల నిర్వహణ, వేసవిలో తాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఎన్ఆర్ఈజీఎస్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆదివాసీ పూజారుల సలహాలతో మేడారంలో గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా వాగుపై చెక్ డ్యామ్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలోని పుష్కరఘాట్ల వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కరీంనగర్ కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాను సత్కరించారు. అడిషనల్కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ సునీత, లైబ్రరీ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే నిధులు ఖర్చు చేయాలి
జీపీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్పంచ్ల చివరి రోజుట్రైనింగ్కు ఆమె హాజరై మాట్లాడారు. 2022 నుంచి 24 వరకు చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎంబీ రికార్డులకు అనుగుణంగా బకాయిలు చెల్లించాలని చెప్పారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామంలో నిర్వహించనున్న పగిడిద్ద రాజు జాతర పోస్టర్ ను మేడారం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ ఇర్ఫ సుకన్యతో కలిసి ఆవిష్కరించారు.
ప్రమాదబీమాపై ఉద్యోగ సంఘాల హర్షం
ములుగు: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేయడంపై తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, అడిషనల్కలెక్టర్ సంపత్‌రావు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ములుగు క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి సీతక్కను కలిసి సన్మానించారు. సంఘం సెక్రటరీ జీవన్ కుమార్, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ నాగేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక పురోగతే ప్రభుత్వ లక్ష్యం
వెంకటాపూర్/గోవిందరావు పేట: మహిళల ఆర్థిక పురోగతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి గురువారం శుంకుస్థాపన చేశారు. ఇటీవల మేడారం జాతరలో మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల వారితో స్టాల్స్ ఏర్పాటు చేయించగా.. పెట్టుబడికి రెండింతల ఆదాయం పొందారని చెప్పారు. ప్రతీ మహిళ మహిళా సంఘాల్లో చేరాలని, 60 ఏండ్లు దాటిన వారు కూడా చేరవచ్చన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, లైబ్రరీ చైర్మన్ బానోత్ రవిచందర్, సర్పంచ్ సుమలత పాల్గొన్నారు.
ముసలమ్మ గుడిని అభివృద్ధి చేయండి
కొత్తగూడ: గుంజేడు ముసలమ్మ గుడిని అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ముసలమ్మ ఉత్సవ నూతన కమిటీ చైర్మన్నరేందర్, సభ్యులతో గురువారం ఆమె ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు ఆలయంలో పూజలు చేశారు. గుడి ఆవరణలో 5 కాటేజ్‌లు,10 గదుల షాపింగ్‌కాంప్లెక్స్, వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. మార్చి 4 నుంచి జరిగే మహా జాతరకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇటీవల కార్లాయిలో వన్యప్రాణి దాడిలో మృతి చెందిన కల్తి గోవింద్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెక్కును అతని భార్య పద్మకు అందజేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి పాల్గొన్నారు.
