రేపు (ఫిబ్రవరి 28) నింగిలోకి ‘రుద్రమ వి-1’ రాకెట్

రేపు (ఫిబ్రవరి 28) నింగిలోకి ‘రుద్రమ వి-1’ రాకెట్
  •   నేడు భద్రకాళి బండ్ వద్ద ట్రయల్ రన్

హనుమకొండ, వెలుగు: ఈ నెల 28న నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని వరంగల్ భద్రకాళి బండ్ పై రుద్రమ వి–1 మోడల్ రాకెట్ నింగిలోకి ఎగరనుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని కుడా ఆఫీస్ లో రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి, ఎన్ఐటీ ప్రొఫెసర్​అంజన్ కుమార్ తో కలిసి పోలీస్, రెవెన్యూ, కుడా, మున్సిపల్ శాఖల ఆఫీసర్లతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

శనివారం సాయంత్రం 5.30 గంటలకు భద్రకాళి బండ్ వద్ద రాకెట్ లాంచింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు కాళోజీ కళాక్షేత్రంలో ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ శేషగిరిరావు రాకెట్ ప్రయోగంపై ప్రసంగిస్తారని చెప్పారు.

భద్రకాళి బండ్ వద్ద రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు సాయంత్రం 4 గంటల నుంచి  విద్యార్థులు, ఔత్సాహికులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. కుడా సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు,  డీఈవో గిరిరాజు గౌడ్, హనుమకొండ తహసీల్దార్​రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.