జంతు సంరక్షణ మానవ బాధ్యత

జంతు సంరక్షణ మానవ బాధ్యత

కుక్క కాటు గాయాలు లేదా మరణాలకు సంబంధించిన కేసులలో, రాష్ట్రాలపై భారీ పరిహారం విధించడంతో పాటు, వీధి కుక్కలకు ఆహారం పెట్టే వ్యక్తులు కూడా బాధ్యత వహించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు జనవరి 13, 2026న సూచించింది.

కుక్క దాడుల వలన కలిగే పరిణామాలను బాధితులు జీవిత కాలం పాటు భరించవలసి వస్తుందని కోర్టు నొక్కి చెప్పింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు ఆ జంతువులను తమ ఇళ్లలో ఉంచుకోవడం ద్వారా వాటి బాధ్యతను ఎందుకు తీసుకోకూడదని కూడా ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు సూచనలను స్వాగతించవలసిన అవసరం  ఉన్నది.  భూమిపై  అనేక రకాలైన జీవజాతులు ఉన్నాయి.  వీటిలో  ఏ  ఒక్క  జీవజాతి సంఖ్య పెరిగినా లేక తగ్గినా  పర్యావరణ అసమతుల్యతకు  దారితీస్తుంది.  అప్పుడు ఆ జీవజాతి సంఖ్యను  పునరుద్ధరించడానికి చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది.  జంతు సంరక్షణ మానవ బాధ్యతగా గుర్తించాలి.

ఉజ్వల భవిష్యత్తు కోసం  విద్యాసంస్థలకు  వెళుతూ ప్రాణాలు  కోల్పోయిన  విద్యార్థులు ఉన్నారు.  వీధి కుక్కల  సమస్య  పట్టణాలలో,  మండలాల్లో  చివరికి  గ్రామాలలో  సైతం  ఉన్నది.   ఆకలి  వలన  వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నట్లుగా భావించవచ్చును. రేబిస్  వైరస్  సోకిన  కుక్కలను / జంతువులను సాధారణ ప్రజలు గుర్తించలేరు. రేబిస్  వైరస్  సోకిన కుక్క  కరిచినా  లేదా చిన్నగోరు గాయం చేసినా  లేదా నోటితో  మానవ శరీరాన్ని నాకినా, ఇది చిన్న విషయంగా/ గాయంగా భావించి పెద్దగా పట్టించుకోరు. కానీ, ఈ విధంగా  రేబిస్  వైరస్  మానవ శరంలోనికి  ప్రవేశిస్తుంది.

ఉదాహరణకు  ఉత్తరప్రదేశ్‌‌కు  చెందిన  బ్రిజేష్  సోలంకి 22 ఏళ్ల రాష్ట్రస్థాయి  కబడ్డీ క్రీడాకారుడు.  అతను  ఒక  కాలువ  నుంచి  కుక్కపిల్లని  రక్షించేటప్పుడు  అది  అతని  చేతిని కొరికింది.  అది చిన్న గాయమని భావించి,  నిర్లక్ష్యం  చేయటంతో  జులై 2025లో   రేబిస్  వైరస్ వ్యాధితో  బ్రిజేష్  సోలంకి మరణించాడు. డబ్ల్యూహెచ్​ఓ  ప్రకారం భారతదేశంలో  రేబిస్  వైరస్ వలన  సంభవించే  మరణాల సంఖ్య  ఏటా దాదాపు 20,000గా ఉంది. 

జూనోటిక్ వ్యాధులు
జూనోటిక్  వ్యాధులు అంటే  జంతువుల నుంచి మానవులకు  సంక్రమించే  అంటువ్యాధులు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రకారం అంటు వ్యాధుల్లో సుమారు 60%,   కొత్తగా వచ్చే వ్యాధుల్లో 75%  జూనోటిక్ వ్యాధులే. కొన్ని సాధారణ జూనోటిక్ వ్యాధులు.  రేబిస్, ఆంత్రాక్స్,  నిఫా వైరస్,  బర్డ్ ఫ్లూ,  మంకీపాక్స్ వంటివి. కుక్క వంటి పెంపుడు జంతువులను పెంచుకొనేవారు  జంతువుల పెదవులపై  ముద్దులు ఇవ్వటం వంటి అతిప్రేమను చూపించే పనులను చేయకుంటే  మంచిది. 

ఉదాహరణకు  అమెరికాలోని  ఓహియోలో  మేరీ ట్రైనర్  2019లో  తన  జర్మన్ షెపర్డ్  పెంపుడు కుక్క ఆమె శరీరంపై గల చిన్న కోతను నాకడం వలన బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి, గ్యాంగ్రీన్ వచ్చి రెండు చేతులు, రెండు కాళ్లు కోల్పోయింది.  దీనికి కారణం  కాప్నోసైటోఫాగా  కానిమోర్సస్  అనే బ్యాక్టీరియా (కుక్క నోటిలో సాధారణంగా ఉంటుంది) ఆమె శరీరంలోనికి  ప్రవేశించడమే.  

స్టెరిలైజేషన్తో నియంత్రణ
వీధి కుక్కలను  నియంత్రించేందుకు  స్టెరిలైజేషన్  వంటి  కార్యక్రమాలని  విరివిగా  చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రేబిస్ వైరస్ గల జంతువులను గుర్తించటం, రేబిస్ వైరస్, వ్యాక్సినేషన్​పై ప్రజలకు విస్తృతమైన పూర్తి అవగాహన  కల్పించాలి. 

ముఖ్యంగా  చిన్నపిల్లలకు, విద్యార్థులకు, గ్రామీణ ప్రజలకు  పూర్తి  అవగాహన  కల్పించాలి.  చిన్న గ్రామాలలో సైతం రేబిస్ వైరస్ వాక్సిన్​ను అందుబాటులో  ఉంచాలి.   ఉచితంగా  బాధితులకు వ్యాక్సిన్ అందిచాలి. కుక్క కాటుకు గురైతే  వెంటనే ఆసుపత్రికి  వెళ్లి  వైద్యుడిని సంప్రదించాలి.  ఈ మధ్యకాలంలో నివాసాల మధ్య కోతుల బెడద ఎక్కువైనది.  దీనికి  మూల కారణం  అడవులను తొలగించడం. అదే విధంగా వీధి కుక్కల సమస్యకు  మూలకారణాలను నివారిస్తే  మంచిది.

కుక్క విశ్వాసం గల జీవి. కాబట్టి, వీధి కుక్కల పట్ల  సమాజంలోని  ప్రజలందరికీ  సానుభూతి, కరుణ, దయ, ప్రేమానురాగాలు ఉన్నాయి. అయితే, జంతు ప్రేమికులు చెపుతున్నట్టుగా  క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవు. కాబట్టి  వీరు క్షేత్రస్థాయిలో  విస్తృతంగా పరిశోధనలు చేసి నిజానిజాలు తెలుసుకొని పరిష్కార మార్గాలను చూపాలి. దీంతో  జంతు ప్రేమికులు   ప్రజలకు,  వీధి కుక్కలకు  మేలు చేసినవారు అవుతారు. అంతే గానీ ప్రభుత్వాలను, వ్యవస్థలను,  ప్రజలను  నిందించడం  సరైన విధానం కాదు. వీధి కుక్కల సమస్యను పర్యావరణ, ప్రజలు,  జంతువుల  సంక్షేమకోణంలో  ఆలోచిస్తే మంచిది.

వ్యాక్సిన్  ద్వారా రేబిస్ నివారణ
కుక్క కాటు లేదా రేబిస్ వైరస్‌‌కు గురైనప్పటి నుంచి లక్షణాలు  కనిపించేవరకు పట్టేకాలం  నిర్దిష్టంగా ఒకే విధంగా ఉండదు. ఈ కాలం వేరువేరుగా ఉంటుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ,  సెంటర్స్  ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్  వంటి  విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ కాలం సాధారణంగా ఒక వారం నుంచి ఒక  సంవత్సరం వరకు ఉంటుంది లేదా 2–3 నెలలు  ఉండవచ్చును. అరుదైన సందర్భాల్లో ఇది 4–5 రోజులు మాత్రమే ఉండవచ్చు లేదా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం  ఉండవచ్చును.

కుక్క కాటు జరిగిన తర్వాత  లక్షణాల కోసం ఎదురుచూడకుండా  వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అది చిన్న గాయమైనా సరే!  రేబిస్  వైరస్ను  వ్యాక్సిన్  తీసుకోవటం ద్వారా నివారించడం  చాలా సులభం. రేబిస్  వైరస్‌‌ లక్షణాలు (జ్వరం,  నీటికి  భయం/ హైడ్రోఫోబియా వంటివి) కనిపించిన తర్వాత దాదాపు 100% మరణం సంభవిస్తుంది.

డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్