
లండన్: వింబుల్డన్ విమెన్స్ ఫైనల్‌కు అమండా అనిసిమోవా (అమెరికా), ఇగా స్వైటెక్ (పోలాండ్) రెడీ అయ్యారు. ఇందులో ఎవరు గెలిచినా కొత్త చాంపియన్‌గా నిలుస్తారు. వింబుల్డన్‌లో కొత్త చాంపియన్ రావడం ఇది వరుసగా ఎనిమిదోసారి అవుతుంది. 2022 యూఎస్ ఓపెన్ తర్వాత సెరెనా విలియమ్స్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. అప్పట్నించి విమెన్స్ టెన్నిస్‌లో ఆ స్థాయిలో ఆధిపత్యం చూపెట్టిన ప్లేయర్ ఇంతవరకు రాకపోవడం గమనార్హం. ఒకరిద్దరు వచ్చినా ఒకటి, రెండు టోర్నీలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం 13వ సీడ్ అనిసిమోవాకు, స్వైటెక్‌కు ఇది తొలి వింబుల్డన్ ఫైనల్.
స్వైటెక్ రోలాండ్ గారోస్‌లో నాలుగుసార్లు, యూఎస్ ఓపెన్‌లో ఒకసారి చాంపియన్‌గా నిలిచింది. కానీ వింబుల్డన్‌లో మాత్రం ఇప్పటి వరకు క్వార్టర్స్ దాటలేదు. ‘నేను ఫైనల్ ఆడతానని కలలో కూడా ఊహించలేదు’ అని స్వైటెక్ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. మూడు వారాల కిందట స్వైటెక్ ఏ గ్రాస్ కోర్టు టోర్నీలోనూ టైటిల్ మ్యాచ్‌లో పాల్గొనలేదు. హోంబర్గ్ టోర్నీలో మాత్రం రన్నరప్‌గా నిలిచింది. ఇక అనిసిమోవా ఇటీవల క్లీన్స్ క్లబ్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత కెరీర్‌లో అతిపెద్ద ఫైనల్ ఆడబోతున్నది.
అనిసిమోవా శక్తివంతమైన షాట్స్ గ్రాస్ కోర్టుకు సరిగ్గా సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2023లో మానసిక సమస్యలు ఎదుర్కొన్న అనిసిమోవా వాటి నుంచి బయటపడి ప్రస్తుతం అత్యుత్తమ టెన్నిస్ ఆడుతోంది. ‘ఆటకు టైమ్ కేటాయించకపోతే ఎప్పటికీ టాప్ ప్లేస్‌కు చేరుకోలేరని నాకు చాలా మంది చెప్పారు. అది జీర్ణించుకోవడం కొద్దిగా కష్టం. ఎందుకంటే నేను తిరిగి వచ్చి చాలా సాధించాలని కోరుకుంటున్నా. ఏదో ఓ రోజు గ్రాండ్‌స్లామ్ గెలవాలని కోరుకున్నా’ అని అనిసిమోవా పేర్కొంది.
2016లో సెరెనా తన ఏడో, చివరి వింబుల్డన్ టైటిల్ నెగ్గింది. ఆ తర్వాత ఇప్పటివరకు ప్రతిసారి కొత్త చాంపియనే వస్తోంది. గతంలో చాంపియన్లుగా నిలిచిన గార్బిన్ ముగురుజా (2017), ఎంజెలిక్ కెర్బర్ (2018), సిమోనా హలెప్ (2019), ఆష్ బార్టీ (2021) రిటైర్ అయ్యారు. తర్వాత ఎలెనా రిబకిన (2022), మార్కెటా వొండ్రుసోవా (2023), బార్బోరా క్రెజికోవా (2024) చాంపియన్లుగా నిలిచారు. కొవిడ్ కారణంగా 2020 టోర్నీ రద్దు చేశారు.