- స్వియాటెక్, అల్కరాజ్, మెద్వెదెవ్ ముందంజ
- ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఎలెనా రిబకినాకు ఈసారి అదృష్టం కలిసిరాలేదు. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో అన్నా బ్లింకోవా (రష్యా) 6–4, 4–6, 7–6 (22/20)తో మూడోసీడ్ రిబకినాకు షాకిచ్చి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టింది.
2 గంటల 46 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బ్లింకోవా చివర్లో అద్భుతం చేసింది. విమెన్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్ ఏకంగా 22 పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తొలి సెట్‌లో రిబకినా సర్వ్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన రిబకినా ఈజీగా సెట్ నెగ్గింది. కానీ రెండో సెట్ సర్వీస్‌ల్లో తడబడింది. దీంతో రెండుసార్లు సర్వీస్ కోల్పోవడంతో ఈ సెట్ రిబకినా సొంతమైంది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు గొప్పగా ఆడారు.
సర్వీస్‌లను బ్రేక్ చేసుకుంటూ వెళ్లడంతో టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లో బ్లింకోవా అద్భుతంగా పోరాడింది. కోర్టులో పరుగెత్తి లెగ్స్, హ్యాండ్స్‌లో వణుకు వచ్చినా పట్టువిడవకుండా బలమైన క్రాస్ కోర్ట్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో రెచ్చిపోయింది. రిబకినా కూడా అంతే దీటుగా స్పందించడంతో టైబ్రేక్ 42 పాయింట్ల వరకు సాగింది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ స్వియాటెక్ (పోలెండ్) 6–4, 3–6, 6–4తో కొలిన్స్ (అమెరికా)పై గెలవగా, ఐదోసీడ్ పెగులా (అమెరికా) 4–6, 2–6తో క్లారా బురెల్ (ఫ్రాన్స్) చేతిలో ఓడింది.
మెన్స్ సింగిల్స్ రెండోరౌండ్‌లో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 6–3, 7–6 (7/3)తో లోరెంజో సోనెగో (ఇటలీ)పై, మెద్వెదెవ్ (రష్యా) 3–6, 6–7 (1/7), 6–4, 7–6 (7/1), 6–0తో ఎమిల్ రుసువోరి (ఫిన్లాండ్)పై, జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 3–6, 4–6, 7–6 (7/5), 7–6 (10/7)తో క్లెనిన్ (స్లొవేకియా)పై, కాస్పర్ రుడ్ (నార్వే) 6–3, 6–7 (5/7), 6–3, 3–6, 7–6 (10/7)తో పుర్సెల్ (ఆస్ట్రేలియా)పై, దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–2, 4–6, 6–4తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై, నోరి (అమెరికా) 3–6, 6–4 (4/7), 6–2, 6–4, 6–4తో జెప్పెరీ (ఇటలీ)పై గెలిచి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టారు.
నగాల్ ఔట్
ఇండియా యంగ్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చుక్కెదురైంది. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో నగాల్ 6–2, 3–6, 5–7, 4–6తో జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. 2 గంటల 50 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో.. ఆరంభంలో ఇండియన్ ప్లేయర్ మెరుగ్గా ఆడాడు. కానీ రెండు, మూడో సెట్‌లో షాంగ్ అద్భుతంగా పుంజుకున్నాడు. నాలుగో సెట్‌లో నగాల్ బాగా పోరాడినా ఏస్‌లు కొట్టడంలో ఫెయిలయ్యాడు.
ప్రత్యర్థి కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్లకు బదులీయలేకపోయాడు. మూడుసార్లు సర్వ్‌ను కోల్పోయి సెట్‌ను, మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. నగాల్‌కు రూ. 98 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. మెన్స్ డబుల్స్‌లో రోహన్ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో జేమ్స్ డక్‌వర్త్–మార్క్ పోల్మన్స్ (ఆస్ట్రేలియా) పై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. 2 గంటల 9 నిమిషాల మ్యాచ్‌లో ఇండో–ఆసీస్ జోడీ ఓ దశలో 0–5తో వెనకబడింది. కానీ బోపన్న తన ఎక్స్‌పీరియెన్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. మరో మ్యాచ్‌లో విజయ్ సుందర్ ప్రశాంత్–అనిరుధ్ చంద్రశేఖర్ 3–6, 4–6తో ఫుక్సోవిచ్–ఫాబియన్ (హంగేరి) చేతిలో ఓడారు.
