అన్నారం దర్గా ఉర్సు షురూ

అన్నారం దర్గా ఉర్సు షురూ
  • గంధం ఊరేగింపులో పాల్గొన్న భక్త జనం...- దర్గాలో ప్రముఖుల ప్రార్థనలు

పర్వతగిరి, వెలుగు:  వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్​ దర్గా ఉర్సు సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా దర్గా ప్రధాన ముజేవార్​ బోలేషావళి ఇంటివద్ద ముజేవార్లు పాషా, గౌష్​పాషా, ఖాజాపాషా తదితరులు ‘సంథల్’ (​గంధం) పూజలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల మధ్య సలాం పాటలతో ఊరేగింపు ప్రారంభమైంది. 

ఇందులో ఖవాలీ, ఫకీర్ల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం హజ్రత్​ సయ్యద్​ యాకూబ్​ షావళికి గంధం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు యాకూబ్​బాబా దర్గాతో పాటు గౌష్​పాక్​, మహాబూబీమా, బోలేషావాలి, గుంషావళి దర్గాలవద్ద భక్తులు తమ మొక్కులు సమర్పించుకున్నారు. దర్గా ప్రాంగణంలో వక్ఫ్​బోర్డు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్​ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గాడిపెల్లి మహేందర్, మాజీ సొసైటీ చైర్మన్​ మనోజ్​గౌడ్, మాజీ  మండల కోఆప్షన్​ సభ్యుడు షబ్బీర్, పాషా, గౌష్​, ఖాజాపాషా తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖుల పూజలు..

అన్నారం దర్గాలో సోమవారం ఈస్ట్​ జోన్​ డీసీపీ అంకిత్​కుమార్, మామునూర్​ ఏసీపీ వెంకటేశ్​ ప్రత్యేక పూజలు చేశారు. ​అనంతరం వారు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.