డబుల్​ డోస్​ వేసుకోవాలె

డబుల్​ డోస్​ వేసుకోవాలె
  • ఇన్‌‌‌‌పేషెంట్లలో 60 శాతం 
  • వ్యాక్సిన్​ వేసుకోనోళ్లే
  • హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ స్టడీలో వెల్లడి
  • విదేశీ వేరియంట్ల ముప్పూ ఉంది
  • అప్రమత్తంగా ఉండాలి: డీహెచ్
  • వ్యాక్సిన్, మాస్కే  రక్షణ మార్గాలు

హైదరాబాద్, వెలుగు: కరోనాతో దవాఖాన్లలో చేరుతున్న వాళ్లలో 60 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లేనని హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రకటించింది. 2 నెలల ఇన్​పేషెంట్ల వివరాల ఆధారంగా స్టడీ చేశామని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం ‘వెలుగు’కు తెలిపారు. ప్రతి వంద మంది ఇన్‌‌‌‌ పేషెంట్లలో రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు పది మంది మాత్రమే ఉంటున్నారని చెప్పారు. వారు కూడా త్వరగానే కోలుకుంటున్నారన్నారు. రెండు డోసులు తీసుకున్న వాళ్లకంటే సింగిల్ డోసు వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు ఎక్కువగా హాస్పిటళ్ల పాలవుతున్నారన్నారు. ప్రతి వంద మంది ఇన్‌‌‌‌పేషెంట్లలో 30 మంది సింగిల్ డోసు వేయించుకున్నవాళ్లు ఉంటున్నారని ఆయన తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.విదేశాల నుంచి కరోనా కొత్త వేరియంట్లు వచ్చే ముప్పు కూడా పొంచి ఉందని డీహెచ్ హెచ్చరించారు. ‘‘ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలి. థర్డ్ వేవ్ డిసెంబర్ చివరికల్లా రాకుంటే ఇక ఆ తర్వాత వచ్చే అవకాశం ఉండనట్టే. కాబట్టి అప్పటిదాకా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో కరోనా పూర్తిగా కంట్రోల్లో ఉంది. ఇతర రాష్ర్టాల్లోనూ కంట్రోల్లోకి వచ్చింది” అని అన్నారు.


‘‘అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఇప్పటికీ వేలు, లక్షల్లో కేసులు వస్తుండటంఆందోళనకరం. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విదేశాలకు రాకపోకలు పెరిగినందున అక్కడి వేరియంట్లు మనకు వచ్చే ముప్పుంది. దీన్ని తప్పించుకోవడానికి మాస్క్, వ్యాక్సినే ఆయుధాలు” అని శ్రీనివాస రావు వివరించారు.
సెకండ్ డోసుకు 35 లక్షల మంది డుమ్మా
కరోనా తగ్గిపోయిందన్న నిర్లక్ష్యంతో రాష్ట్రంలో చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని డీహెచ్ అన్నారు. ‘‘కనీసం 30 శాతం మంది కూడా మాస్క్ పెట్టుకోవడం లేదు. ఫస్ట్ డోసు వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు సెకండ్ డోసుకు రావడం లేదు. సుమారు 36,35,475 మంది సెకండ్ డోసుకు డుమ్మా కొట్టారు. వీళ్లందరి సెకండ్ డోసు గడువు ముగిసింది. వీరంతా ఇప్పటికైనా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. రాష్ట్రంలో 69.35 లక్షల మంది ఒక్క డోసు కూడా వేయించుకోలేదు. 83.07 లక్షల మందికి మాత్రమే రెండో డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మరో 1.26 కోట్ల మంది సింగిల్ డోసు వేయించుకున్నారు” అని చెప్పారు. బస్తీ దవాఖాన్లలోనూ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. దగ్గర్లోని బస్తీ దవాఖానా, సబ్‌‌ సెంటర్ లేదా పీహెచ్‌‌సీకి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. రిజిస్ర్టేషన్, టోకెన్ వంటి ముందస్తు బుకింగ్స్ అవసరం లేదని, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 మధ్య ఎప్పుడైనా వెళ్లి వేయించుకోవచ్చని చెప్పారు.
త్వరలో పిల్లల వ్యాక్సిన్!
పిల్లల కరోనా వ్యాక్సిన్ కోసం ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లొద్దని ప్రజలకు డీహెచ్ సూచించారు. భారత్ బయోటెక్ తయారు చేసిన పిల్లల వ్యాక్సిన్‌‌కు త్వరలోనే పర్మిషన్ రావచ్చు. రాగానే పిల్లలకు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తాం” అని 
వివరించారు.
కొత్త కేసులు 191
రాష్ట్రంలో బుధవారం మరో 191 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ‘‘41,682 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్‌‌లో 49 మందికి, జిల్లాల్లో 142 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,69,556కి చేరింది” అని వివరించింది. వీరిలో 6,61,646 మంది కోలుకున్నట్టుగా చూపించారు. ఇంకో 3,968 యాక్టివ్‌‌ కేసులున్నాయని పేర్కొన్నారు. వీరిలో 1696 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వాళ్లు హోమ్ ఐసోలేషన్‌‌లో ఉన్నారు. కరోనాతో బుధవారం మరొకరు చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 3,942కు పెరిగిందని పేర్కొన్నారు.