తమన్నాపై అణ్ణు కపూర్ నోటి దురుసు.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు సీరియస్!

తమన్నాపై అణ్ణు కపూర్ నోటి దురుసు.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు సీరియస్!

సీనియర్ నటుడు, ప్రముఖ టీవీ హోస్ట్ అణ్ణు కపూర్ లేటెస్ట్ గా హీరోయిన్ తమన్నా భాటియాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.  తమన్నాను పొగుడుతూనే, ఆమెను ఉద్దేశించి "పాల వంటి శరీరం" (ధూధియా బదన్) అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు అసభ్యకరంగా, అసహ్యంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అణ్ణు కపూర్ నోటి దురుసు

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అణ్ణు కపూర్ తన లేటెస్ట్ చిత్రం 'ఆజ్ కి రాత్' పాట గురించి మాట్లాడుతుండగా, హోస్ట్ శుభంకర్ మిశ్రా ఒక ప్రశ్న అడిగారు. దానికి స్పందిస్తూ అణ్ణు కపూర్, "మాషా అల్లాహ్, క్యా ధూధియా బదన్ హై (దేవుడా, ఎంత పాలు లాంటి శరీరం)" అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే హోస్ట్, తమన్నా గతంలో చేసిన ఒక కామెంట్‌ను ప్రస్తావించారు. "పిల్లలు నా పాట వింటే నిద్రపోతారు" అని తమన్నా చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా, అణ్ణు కపూర్ మరింత ఎగతాళిగా మాట్లాడారు. "ఎంత వయసు ఉన్న పిల్లలు నిద్రపోతారు? 70 ఏళ్ల వయసున్నవాడు కూడా పిల్లవాడే కదా. ఇంగ్లీషులో అంటారు కదా... 70 ఏళ్ల పాత పిల్లవాడు, 11 ఏళ్ల వృద్ధుడు అని. నేనుంటే అడిగేవాడిని, ఎంత వయసు ఉన్న పిల్లలు నిద్రపోతారు అని అంటూ వ్యంగ్యంగా నవ్వారు.

నెటిజన్ల ఫైర్..  "మీకు కూతుళ్లు లేరా?"

ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సీనియర్ నటుడిగా, హోస్ట్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న అణ్ణు కపూర్ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంత అసభ్యమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు? మీకు కూతుళ్లు లేదా మనుమరాళ్లు లేరా?. అణ్ణు కపూర్ వంటి గౌరవనీయ నటుడి నుంచి ఇలాంటి చీప్ కామెంట్స్ ఊహించలేదు అంటూ మండిపడుతున్నారు.

►ALSO READ | Prabhas: 'ది రాజా సాబ్' వెనుక వివాదం. . విడుదల వాయిదాకి కారణం చెప్పిన నిర్మాత!

సెలబ్రిటీల పట్ల ఇలాంటి అసంబద్ధమైన, బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేయడంపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ వివాదంపై తమన్నా భాటియా గానీ, అణ్ణు కపూర్ గానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వివాదం సినీ పరిశ్రమలో మరోసారి మహిళా నటీమణుల పట్ల ఉన్న విలువలు, గౌరవం గురించి చర్చకు దారితీస్తోంది.