తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు 57% పెరిగినయ్ : డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు  57% పెరిగినయ్ : డీజీపీ మహేందర్ రెడ్డి
  • పోయినేడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేటు 4 శాతం ఎక్కువ 
  • మొత్తం 1.42 లక్షల కేసులు నమోదు.. మహిళలపై పెరిగిన నేరాలు   
  • యాన్యువల్ క్రైమ్ రిపోర్టును విడుదల చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి
  • సీసీ కెమెరాలతో 18 వేల కేసులు సాల్వ్ చేసినం
  • వెయ్యి మందితో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేస్తమని వెల్లడి 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది కూడా క్రైమ్ రేట్‌‌‌‌ పెరిగింది. ఓవరాల్ క్రైమ్‌‌‌‌ రేట్‌‌‌‌ పోయినేడాదితో పోలిస్తే 4.44 % ఎక్కువగా నమోదైంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,42,917 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సైబర్‌‌‌‌ ‌‌‌‌నేరాలు 57% పెరగ్గా... వైట్‌‌‌‌కాలర్ నేరాలు 35%, మహిళలపై దాడులు 3.8%, కిడ్నాప్‌‌‌‌లు 15% , దోపిడీలు 7% పెరిగాయి. సైబర్ నేరాలు పోయినేడాది 8,839 నమోదు కాగా, ఈసారి 13,895 నమోదయ్యాయి. పోక్సో కేసులు పోయినేడు 2,567 నమోదు కాగా, ఈసారి 2,432 నమోదయ్యాయి. గురువారం హైదరాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాన్యువల్ క్రైమ్ రిపోర్టును డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. పోలీస్ టెలిఫోన్ డైరీ, గత ఆరేండ్లలో రాష్ట్ర పోలీసుల కార్యకలాపాలకు సంబంధించిన బుక్‌‌‌‌ ను ఆవిష్కరించారు. 31న రాష్ట్ర డీజీపీగా తాను రిటైర్ అవుతున్నట్లు మహేందర్ రెడ్డి ప్రకటించారు. తనకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

మావోయిస్టులను కట్టడి చేసినం.. 

ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం వెయ్యి మందితో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌‌‌‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ‘‘మావోయిస్టులు రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయడంలో విజయం సాధించాం. 3 ఎన్ కౌంటర్లు జరగ్గా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.120 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి 14 ఆయుధాలు, రూ.12.65 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నాం” అని పేర్కొన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 10.25 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలి పారు. ‘‘సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులను సాల్వ్ చేసినం. హాక్‌‌‌‌ ఐ ద్వారా వచ్చిన 61,674 ఫిర్యాదులను పరిష్కరించాం. అత్యాధునిక ఫింగర్‌‌‌‌ ‌‌‌‌ప్రింట్‌‌‌‌ టెక్నాలజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది పాత నేరస్తుల డేటా బేస్‌‌‌‌ తయారు చేశాం. దీని ఆధారంగా ఈ ఏడాది 420 కేసులను ఛేదించాం” అని చెప్పారు. ఎఫ్​ఐఆర్​ల పరంగా ఉత్తమ పీఎస్​లను డీజీపీ ప్రకటించారు. ఉప్పల్​ (వెయ్యికి పైగా), కోదాడ (500 నుంచి వెయ్యి), ఆదిలాబాద్​ వన్​ టౌన్​ (250 నుంచి 500), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పీఎస్​ (150 నుంచి 200), మహబూబాబాద్​ జిల్లా సీరోల్​ పీఎస్​ (150 కంటే తక్కువ)లు ఉత్తమ పీఎస్​లుగా నిలిచాయి.