- కేసీఆర్ ను ఎందుకు దింపాలి అనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
- దానిపై అందరికి స్పష్టత ఉండాలి: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్
- ఏడేండ్ల పాలన, ఉద్యమ విలువలపై టీజేఎస్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ సభ
- సభలో పాల్గొన్న విద్యావేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు
హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల తోపాటు అస్థిత్వం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేశాము. తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకున్నాం గాని రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన లేదు. అరాచకాలు మితిమీరిపోయాయి..అందుకే కేసీఆర్ ను ఎందుకు గద్దె దింపాలి అనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దానిపై అందరికి స్పష్టత ఉండాలి. మెరుగైన పాలన కోసం మరో పోరాటం అవసరం. కనీస మౌలిక మార్పుల కోసం కలిసి వచ్చే వారితో కలిసి పోరాటం చేస్తాం..’’ అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఏడేండ్ల పాలన,ఉద్యమ విలువలపై టీజేఎస్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ ప్రజాస్వామిక విలువలకు గౌరవం వుండే విధంగా రాజకీయాల్లో మార్పులు అవసరం ఉందన్నారు. ప్రజల అభివృద్దే లక్ష్యంగా పోరాట కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విమలక్క మాట్లాడుతూ ఏడేళ్ల తెలంగాణలో వెనక్కి తిరిగి చూస్తే ఏమీలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నాం. గత ఉద్యమాల అనుభవంతో కలలు కన్న తెలంగాణ కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉద్యమ విలువలు తగ్గిపోతున్నాయని, ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆరెస్ పార్టీ ఉద్యమాలను అణిచివేస్తోందని ఆరోపించారు. ప్రగతి భవన్ లోనే క్యాబినెట్ సమావేశాలు పెట్టుకునే దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రం వచ్చి ఏడేండ్లు అయినా ఇంకా ఏడుస్తున్న తెలంగాణ చూస్తున్నాం, ఉద్యమ విలువలు ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు మేలు జరిగే తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాజకీయ కల్చర్ లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయనే అశలో తెలంగాణ యువత ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడటం లేదు, ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ లో పార్టీ పెట్టడంపై ప్రశించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న చైతన్యం మల్లీ రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
