కామారెడ్డి జిల్లా మీదుగా హైవే పనులు షురూ

కామారెడ్డి జిల్లా మీదుగా హైవే పనులు షురూ
  •  సర్వే పనులు కంప్లీట్ 
  • మెదక్ జిల్లా నుంచి ఎల్లారెడ్డి మీదుగా రుద్రూరు జంక్షన్ వరకు..

కామారెడ్డి జిల్లా మీదుగా ఇప్పటికే రెండు నేషనల్‌ హైవేలు వెళ్తుండగా త్వరలోనే మరో హైవే నిర్మాణ పనులు షూరు కానున్నాయి. హైవేకు సంబంధించిన భూ సేకరణ సర్వే పక్రియ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే భూ సేకరణ చేపట్టి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు. 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్​-– నాగ్​పూర్​ హైవే వెళ్తుంగా, ఇటీవల సంగారెడ్డి - నాందేడ్,  ఆకోల హైవే నిర్మాణం కంప్లీట్ అయ్యింది. పలు స్టేట్‌లతో జిల్లాకు రవాణా మార్గం అనుసంధానమైంది. కర్నాటక, మహారాష్ట్ర,  ఉత్తర్‌‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలకు జిల్లాలోని రెండు నేషనల్​హైవేల మీదుగా ప్రతి రోజు వేల సంఖ్యలో వెహికల్స్​ రాకపోకలు సాగిస్తాయి.  స్టేట్ హైవేగా ఉన్న మరో  రోడ్డును కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ హైవేగా ప్రకటించింది. హైదరాబాద్​ నుంచి నర్సాపూర్‌‌​- మెదక్​- ఎల్లారెడ్డి- బాన్సువాడ వరకు ఉన్న స్టేట్​హైవేను మరింత పొడిగించి నేషనల్​ హైవేగా ప్రకటించారు. ఇప్పటికే  హైదరాబాద్ ​నుంచి నర్సాపూర్– రుద్రూరు​ వరకు పనులు జరిగాయి.

మొత్తం 248 కిలోమీటర్లు..
హైదరాబాద్– నర్సాపూర్–- రుద్రూర్– మెదక్​- ఎల్లారెడ్డి–- రుద్రూర్–- బోధన్– బాసరా–బైంసా జంక్షన్​వరకు 248 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పలు జిల్లాలను కలుపుతూ వెళ్తున్న ఈ హైవే ఇతర రాష్ట్రాలకు వెళ్లే  హైవేలను కూడా కలపనుంది. కామారెడ్డి జిల్లాలో  ఈ హైవే నాగిరెడ్డిపేట మండలం పోచారం నుంచి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్–​బొగ్గుగుడిసె,  బాన్సువాడ  మీదుగా నిజామాబాద్​ జిల్లా రుద్రూరు మీదుగా బోధన్, బాసరా, బైంసా వరకు గుర్తించారు. జిల్లాలో 65 కి.మీ మేర హైవే నిర్మాణం జరగ నుంది. హైవే నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం సర్వే కూడా చేపట్టారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, బాన్సువాడ మండలాల్లో ఏఏ ఏరియాలో ఎంత మేర భూమి అవసరమనేది గుర్తులు పెట్టారు. మొత్తం 200 ఎకరాల వరకు భూమి అవసరమున్నట్లు గుర్తించారు. దీనికనుగుణంగా త్వరలో రెవెన్యూ ఆఫీసర్లు భూ సేకరణ చేయనున్నారు. 

పెరగనున్న కనెక్టివిటీ...
కొత్తగా ఈ హైవే నిర్మాణంతో జిల్లాకు మరింతగా రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. సంగారెడ్డి నుంచి నాందేడ్​– ఆకోల వరకు నిర్మాణం జరిగిన హైవే నుంచి మద్నూర్​ నుంచి రుద్రూర్​వరకు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీంతో రెండు హైవేలు రుద్రూర్ జంక్షన్‌ను కలుపుతాయి. ఎల్లారెడ్డి, బాన్సు వాడ ఏరియా మరింతగా డెవలప్‌మెంట్‌ కావటానికి వీలుంది. కరీంనగర్​- కామారెడ్డి–ఎల్లారెడ్డి (కేకేవై) స్టేట్​ హైవేను పిట్లం వరకు పొడిగించి హైవేగా డీపీఆర్​ పంపారు. ఈ రోడ్డు హైవేగా గుర్తించాల్సి ఉంది. ఈ రోడ్డు పూర్తయితే రవాణా వసతులు మెరుగుపడడంతో పాటు ఆయా ఏరియాలు కూడా డెవలప్‌మెంట్ అయ్యేందుకు అస్కారముంది.