మిల్లర్లకు మరో నెల రోజుల పాటు వెసులుబాటు

మిల్లర్లకు మరో నెల రోజుల పాటు వెసులుబాటు

హైదరాబాద్‌‌, వెలుగు: గత రెండు సీజన్ల కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌(సీఎంఆర్) గడువు నెలరోజులపాటు పెంచేందుకు కేంద్రం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆహారమంత్రిత్వశాఖ కార్యదర్శి అశోక్‌‌కుమార్‌‌ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మిల్లర్లు బియ్యం అందించడానికి ఈనెలాఖరు వరకే గడువు ఉంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న బియ్యం సేకరణ వివాదం నేపథ్యంలో గత జూన్‌‌ 7నుంచి 43రోజుల పాటు మిల్లింగ్‌‌ నిలిచిపోయింది. తాజాగా కేంద్రం ఆగస్టు 31 వరకు అనుమతించడంతో మిల్లర్లకు మరో నెల రోజుల పాటు వెసులుబాటు కలిగింది. 2020–21 యాసంగి వడ్లు 5.41లక్షల టన్నులు, 2021–22 వానాకాలం వడ్లు 38.17లక్షల టన్నులు వడ్లు మిల్లింగ్‌‌ పూర్తి కాలేదు. వీటికి యాసంగి వడ్లు 50.67లక్షల టన్నులు తోడవడంతో మిల్లులన్నీ వడ్ల బస్తాలతో నిండాయి. తాజాగా కేంద్రం నెల రోజుల గడువు పెంచింది. దీంతో గత రెండు సీజన్ల 43.58లక్షల టన్నుల వడ్లకు క్లియెరెన్స్‌‌ లభించినట్లయింది. 

తడిచిన వడ్ల సంగతి తేలలె

నిల్వ చేయడానికి గోదాములు లేక దాదాపు 15 లక్షల టన్నుల వడ్లను మిల్లుల వద్ద ఆరుబయటే ఉంచారు. ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకు 8 లక్షల టన్నుల వరకు తడిసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తడిసిన బస్తాల్లో వడ్లు మొలకలొచ్చి ఖరాబ్ అయ్యాయి. వాటిని రా రైస్‌‌ చేయడం కుదరదని, కనీసం బాయిల్డ్‌‌ రైస్‌‌ ఇచ్చేందుకు అనుమతించాలని సివిల్‌‌ సప్లయ్స్‌‌ అధికారులు కేంద్రానికి విన్నవించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.