
భద్రాచలం,వెలుగు : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మరో కొత్త బేస్ క్యాంపు ఏర్పాటైంది. మహారాష్ట్ర – చత్తీస్‌గఢ్‌ను అనుసంధానిస్తూ కొత్తగా నిర్మిస్తున్న హైవేకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న హెచ్చరికలతో భూపాలపట్నం పోలీస్స్టేషన్పరిధి ఉల్లూరు పంచాయతీలోని చిల్లామర్కా అటవీలో బేస్ క్యాంపును నెలకొల్పారు. ఫర్సేగఢ్, సేండ్ర, మహారాష్ట్ర బార్డర్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో కదలికలను నియంత్రించేందుకు ఇది దోహదపడుతుంది.
ఇప్పటికే బీజాపూర్‌జిల్లాలో 36 బేస్ క్యాంపులను దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. బీజాపూర్ జిల్లాలో ఇప్పటివరకు 492 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2023 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఎన్ కౌంటర్లలో 193 మంది చనిపోయారు. 900 మంది అరెస్ట్ అయ్యారు. మావోయిస్టుల నియంత్రణకు బేస్‌క్యాంపు లు ఏర్పాటు చేస్తున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు.