మంకీపాక్స్ తో అప్రమత్తంగా ఉండాలె

మంకీపాక్స్ తో అప్రమత్తంగా ఉండాలె

దేశం నుంచి కరోనా పూర్తిగా కనుమరుగు కాకముందే మరో వైరస్ ప్రజలను భయపెడుతోంది. ఢిల్లీలో మంకీపాక్స్ లక్షణాలు కలిగిన వ్యక్తిని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. లోక్ నాయక్ జై ప్రకాష్  నారాయణ ఆస్పత్రిలో అతడికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. బాధితుడి తీవ్రమైన జర్వం, శరీరంపై మచ్చలు  ఉన్నట్టు గుర్తించామన్నారు. పరీక్షల నిమిత్తం అతడి నమూనాలను ల్యాబ్ కు పంపించామని..రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని  చెబుతున్నారు. ఇప్పటికే కేరళలో మూడు.. ఢిల్లీలో ఒక మంకీ పాక్స్ కేసు నమోదవ్వడంతో దేశంలో ఈ కేసులు  నాలుగుకు చేరాయి. 

దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ పై మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయలు, ఓడరేవులలో స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ ను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది..ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది.ఈ వైరస్ విషయమై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

మంకీ పాక్స్ వైరస్ మశూచికి సమానమైన లేదా అంతకంటే తక్కువైన లక్షణాలతో కూడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. మంకీపాక్స్ అనేది జూనోసిస్ జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. మంకీ పాక్స్ సాధారణంగా రెండు నుండి 4 వారాల వరకు ఉంటుంది. పిల్లల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ సోకిన పిల్లల్లో మరణాల రేటు ఎక్కువగా ఉందని వైద్య శాఖాధికారులు చెబుతున్నారు.