మామునూరు ఎయిర్‍పోర్టుకు మరో రూ.90 కోట్లు

మామునూరు ఎయిర్‍పోర్టుకు మరో రూ.90 కోట్లు
  • అదనపు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • భూసేకరణకు గతంలోనే రూ.205 కోట్లు చెల్లింపు  
  • 280.30 ఎకరాల భూమికి పెరిగిన పరిహారం
  • ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున చెల్లింపు

వరంగల్‍, వెలుగు :  మామునూరు ఎయిర్‍పోర్ట్ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.90 కోట్లు విడుదల చేసింది. ట్రాన్స్ పోర్ట్, ఆర్అండ్ బీ డిపార్టుమెంట్‍ స్పెషల్‍ చీఫ్‍ సెక్రటరీ వికాస్‍ రాజ్‍ ఉత్తర్వులు ఇచ్చారు.  ఎయిర్‍పోర్ట్ భూ సేకరణకు అవసరమైన పరిహారం కోసం నిధులను గతంలోనే రాష్ట్ర సర్కార్ ఇచ్చింది. అయితే.. రైతులు నష్టపోకుండా మెరుగైన పరిహారం చెల్లించాలని నిర్ణయించడంతో  అదనపు వ్యయం పెరిగింది. దీంతో ప్రభుత్వం ముందస్తుగా నిధులు చెల్లించడంతో భూ సేకరణ మరింత స్పీడ్‍ కానుంది.  

280 ఎకరాల సేకరణకు రూ.205 కోట్లు  

రాష్ట్రంలో 6 ఎయిర్‍పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో  తొలుత మామునూరు ఎయిర్‍పోర్టును  పున:ప్రారంభించే చాన్స్ దక్కింది. ఇంతకుముందే ఎయిర్‍పోర్ట్ కు 696.14 ఎకరాల  భూములు ఉండగా.. మరో 280.30 ఎకరాలను సేకరించాల్సి వచ్చింది. దీంతో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పలు ధపాలుగా రైతులతో చర్చించి భూములు ఇచ్చేలా ఒప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే పరిహారం అందించేందుకు గతేడాది నవంబర్‍ 17న రూ.205 కోట్లు మంజూరు చేయగా అధికారులు భూసేకరణ వేగంగా చేపట్టారు.  

మరో రూ.90 కోట్లు రిలీజ్

గతంలో ఏ ప్రాజెక్టు భూసేకరణకు ఇవ్వనంతగా ఎకరానికి అధికంగా రూ.1.20 కోట్ల చొప్పున రైతులకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే సగం మందికి చెల్లింపులు జరిగాయి. రైతులకు పరిహారం పెంపుతో రూ.205 కోట్లకు అదనపు వ్యయం పెరిగింది. కలెక్టర్‍ సత్యశారద అదనపు నిధుల మంజూరుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  ఎయిర్ పోర్టుపై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టిన సీఎం రేవంత్‍రెడ్డి వెంటనే మిగతా రూ.90కోట్లను చెల్లించేలా అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్‍.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, నాయిని రాజేందర్‍రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.